రేవంత్ ను చూసి నేర్చుకోండి!

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా వెళుతోంది. అంత‌కు ముందు వ‌ర‌కు తాబేలు న‌డ‌క‌లా ఉన్న పార్టీ రేవంత్ వ‌చ్చిన త‌ర్వాత కుందేలు ప‌రుగులా మారింది. వ‌రుస స‌మావేశాలు.. స‌భ‌లు.. ర్యాలీల‌తో పార్టీకి దూకుడు నేర్పించారు రేవంత్‌. ఇప్పుడు పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా డిసెంబ‌రు 9 నుంచి పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి ఆరంభం ప‌లికారు. దేశంలోనే తెలంగాణ‌లో పైలైట్ ప్రాజెక్టుగా చేప‌డుతున్నారు. ప్ర‌తీ బూత్‌లో 100 మందికి స‌భ్య‌త్వం అందించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకున్నారు. అధిష్ఠానం ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్న శ్రేణులు ఈ దిశ‌గా ముందుకు క‌దులుతున్నాయి.

పీసీసీ చీఫ్ రేవంతే స్వ‌యంగా పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాన్ని స‌మీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక అనూహ్య సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉట్నూర్ మండ‌లం దంత‌న్‌ప‌ల్లికి చెందిన బూత్ ఎన్‌రోల‌ర్ మ‌హ్మ‌ద్ మోబిన్ త‌న‌కు కేటాయించిన బూత్‌లో 251 స‌భ్య‌త్వాలు చేయించారు. అనుకున్న దానికంటే రెండొంతులు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన మోబిన్ కృషికి ఫ‌లితం ద‌క్కింది. రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఫోన్ చేసి అభినందించారు. అత‌ని క్షేమ స‌మాచారాలు తెలుసుకోవ‌డంతో పాటు పార్టీని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని సూచించారు. దీంతో మోబిన్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నాడు.

ఇక‌పై పార్టీ నేత‌లు ఈ విధంగానే ప‌ని చేయాల‌ని.. శ్రేణుల‌తో చేయించాల‌ని రేవంత్ కోరుకుంటున్నారు. భేజ‌షాల‌ను ప‌క్క‌న‌పెట్టి అంద‌రూ స‌మ‌ష్టిగా ప‌నిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాల‌ని ఆదేశించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట‌మిని అంద‌రూ మ‌రిచిపోవాల‌ని.. ఓట‌మి నైరాశ్యం నుంచి బ‌య‌ట‌ప‌డి పార్టీ నిర్మాణం కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. ఒక వైపు పార్ల‌మెంటు స‌మావేశాలు.. ఇంకో వైపు పార్టీలో డీఎస్ వంటి పాత కాపుల ఘ‌ర్ వాప‌సీ కార్య‌క్ర‌మాలు.. మ‌రో వైపు పార్టీ స‌భ్య‌త్వాల‌తో రేవంత్ ఫుల్ స్వింగ్‌లో క‌న‌ప‌డుతున్నారు. మిగ‌తా ముఖ్య నేత‌లు కూడా ఇలాగే క‌ష్ట‌ప‌డితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ క‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తుంద‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.