ఏపీ సీఎం జగన్ కలల ప్రాజెక్టుగా పేర్కొంటున్న.. రాయల సీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం విషయమై అధ్యయన కోసం.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి, కేంద్ర జల సంఘం అధికారి సహా.. నలుగురితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్జీటీ తీర్పు చెప్పింది. ఏపీ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని పేర్కొంది. అయితే.. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ముందు కొన్నాళ్ల కిందటే(నవంబరు 16) సుదీర్ఘ విచారణ జరిగింది.
ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ? అనే అంశంపై ఏపీ వాదనలు వినిపించింది. ప్రజోపయోగ పనులు చేపట్టినందుకు జైలుకు పంపుతారా అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు చేసినవి డీపీఆర్, ఇతర పనుల కోసమేనన్న ప్రభుత్వం.. చేసిన పనులు పూడ్చమంటారా ? అని ఎన్జీటీని ప్రశ్నించింది.
ప్రజోపయోగ పనులను ట్రైబ్యునల్ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి ఫొటోలు ఇచ్చిందని..తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే.. దీనికి భిన్నంగా.. తాజాగా శుక్రవారం ఇచ్చిన తీర్పులో ఏపీ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ అనుమతులు తీసుకుని తీరాల్సిందేనని.. ట్రైబ్యునల్ తీర్పు చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates