ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది – లోకేష్

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. జగన్ ఏడాది పాలనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాలుగేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి అంతా ఏడాది వైసీపీ పాలనలో తుడిచిపెట్టుకుపోయిదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని నారా లోకేశ్‌ విమర్శించారు. ఏపీలో విధ్వంసం రేపేందుకే జగన్ ఒక్క చాన్స్ అడిగారని లోకేశ్ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో..వైసీపీ ఏడాది పాలనపై నారా లోకేష్‌ చార్జిషీట్ రిలీజ్ చేశారు. వైసీపీ ఏడాది పాలనలో నవ మోసాలు, నవ కుంభకోణాలు తప్ప మరేమీ లేవని దుయ్యబట్టారు. గత ఏడాదిగా ఏపీలో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే జగన్‌ రెడ్డి ఏడాది పాలనపై సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనను సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారని, ప్రతి పథకానికి కండీషన్ అప్లయ్‌ అంటున్నారని దుయ్యబట్టారు.

వైసీపీ పాలనలో రైతు రాజ్యం అని జగన్ చెబుతున్నారని, కానీ, గత ఏడాది కాలంలో 564 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లోకేశ్ మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో రైతులను, పెన్షన్‌ పెంపు పేరుతో పేదలను మోసం చేశారని, 3 వేల రూపాయల పెన్షన్ ఊసెత్తినవారిని అరెస్టు చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అంటూ విషం వంటి చీప్‌ లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్‌రెడ్డి పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. మద్యం పేరుతో ప్రజలపై రూ. 25 వేల కోట్ల జే ట్యాక్స్‌ వేస్తున్నారని, పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్….అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ నిధులను అమ్మ ఒడికి మళ్లించారని, రాష్ట్రంలో ఇసుక రేట్లు ఆకాశాన్నంటాయని, ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. యూనిట్ కు‌ రూ.11 చొప్పున చెల్లించి పక్కరాష్ట్రాల నుంచి విద్యుత్ కొంటున్నారని, విద్యుత్ బిల్లు చూస్తే షాక్‌ కొడుతోందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆఖరికి విపత్తు సమయంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం….కరోనా టెస్ట్‌ కిట్లలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, ఇళ్ల స్థలాల పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

మడ అడవులను మడతబెట్టేశారని..ఆవ భూములను ఆబగా లాగించేశారని…జగన్‌ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ విమర్శించారు. విశాఖలో మాస్క్‌లు అడిగిన డాక్టర్ సుధాకర్‌ను దారుణంగా వేధించారని, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట వినలేదని చిత్తూరులో డా.అనితారాణిని నిర్బంధించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఏడాదిలోనే 370 అత్యాచార ఘటనలు జరిగాయని,దిశ చట్టం కింద ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రంగుల విషయంలో హైకోర్టు తీర్పులనే ధిక్కరించారని, రంగుల పేరుతో రూ.2వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

జగన్‌ రెడ్డి సొంత పేరు అబద్ధం అని, జగన్‌రెడ్డి మతం విధ్వంసం అని కులం కక్షపూరితం అని లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్‌ హత్యపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు., రాజధానిని తరలించబోమని చెప్పిన జగన్.. ఇప్పుడు మూడు ముక్కల రాజధాని అంటున్నారని మండిపడ్డారు. జగన్‌ వచ్చాక ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, మాకొద్దు జగన్‌.. పోవాలి జగన్‌ అని వైసీపీ కార్యకర్తలే అంటున్నారని అన్నారు. విధ్వంసంలో ఏపీని అగ్రస్థానానికి తీసుకొచ్చారని, జగన్‌ గన్నేరు పప్పులా తయారయ్యారని మండిపడ్డారు.