కేసీఆర్ సీన్లోకి రావాల్సిన టైం వచ్చేసిందట

KCR

ఆ మధ్యన నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో.. ప్రైవేటు స్కూళ్లు.. అవి వసూలు చేసే ఫీజుల విషయం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సూటిగా సర్కారు పాలసీ ఏమిటో చెప్పేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచకూడదని.. ఏ నెలకు ఆ నెల తీసుకోవాలన్నారు. ట్యూషన్ ఫీజు తప్పించి.. మరే పేరు మీదా వసూలు చేయటాన్ని తాము ఒప్పుకోమన్నారు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కేసీఆర్ నోటి నుంచి మాట వచ్చిన తర్వాత అది శిలాశాసనంలా ఫీలయ్యేటోళ్లకు తెలంగాణలో కొదవ లేదు. కానీ.. అందుకు భిన్నంగా పరిస్థితి ఉందన్న విషయాన్ని తాజాగా వెల్లడించిన ఒక సర్వే కొత్త నిజాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఒక సర్వేను నిర్వహించింది. వాట్సాప్.. ఫేస్ బుక్.. లాంటి ఆన్ లైన్ వేదికల మీద సర్వే నిర్వహించారు.

దీని ద్వారా చాలా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. స్కూల్ ఫీజు పెంచొద్దని సీఎం కేసీఆర్ చెబితే.. అందుకు భిన్నంగా స్కూళ్లు ఫీజులు పెంచినట్లుగా 51 శాతం మంది పేర్కొన్నారు. అంతేకాదు.. ఫీజుల కాకుండా నయా పైసా కూడా వసూలు చేయకూడదన్న దానికి భిన్నంగా యాక్టివిటీ ఫీజుల్ని స్కూళ్లు అడుగుతున్నాయని 38 శాతం మంది వెల్లడించినట్లు చెప్పారు. భోజనం కోసం ఫీజు వసూలు చేస్తున్నట్లు 17 శాతం మంది చెబితే.. ఏ నెలకు ఆ నెల కాకుండా టర్మ్ ఫీజుల్ని 47.5 శాతం మంది వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ల్రైబరీ ఫీజును కూడా స్కూళ్లు వసూల చేస్తున్న 25 శాతం మంది చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా తగ్గుముఖం తగ్గే వరకూ తమ పిల్లల్ని స్కూళ్లకు పంపమని అత్యధిక పిల్లల తల్లిదండ్రులు చెప్పినట్లుగా సర్వే పేర్కొంది. కనీసం వ్యాక్సిన్ వచ్చే వరకూ పిల్లల్ని స్కూల్ కు పంపే ఆలోచన లేదని తేల్చేయటం గమనార్హం. పేరెంట్స్ ఇంత స్పష్టం ఉండటం ఒక ఎత్తు అయితే..ఆన్ లైన్ క్లాసులకు 90 శాతం మంది పేరెంట్స్ ఇష్టపడటం లేదని పేర్కొనటం విశేషం.