దాదాపు ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేసి అనుకున్నది సాధించిన భారతీయ కిసాన్ యూనియన్ తన ఉద్యమానికి ముగింపు పలకబోతోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏడాది కాలంగా చేసిన ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి రైతు సంఘాలకు గతంలోనే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుసంఘాలకు విజ్ఞప్తి కూడా అందింది.
ప్రధాన డిమాండ్ అయిన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడం రైతు సంఘాలు సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి. ప్రస్తుతం పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయడం, ఉద్యమ సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయడం, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేసి కేసులు పెట్టడం లాంటి అనేక డిమాండ్లున్నాయి. వీటిల్లో కనీస మద్దతు ధర చట్టం రూపకల్పనకు కేంద్రం ఓ కమిటిని కూడా నియమించింది.
కేంద్రం చర్యలతో రైతు సంఘాలు కూడా హ్యాపీగానే ఉన్నాయి. ఇదే విషయమై బుధవారం జరిగే సమావేశంలో ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఉద్యమానికి నేతృత్వం వహించిన రాకేష్ తికాయత్ ప్రకటించారు. ప్రధాన డిమాండ్ పరిష్కారమైపోవటం, మద్దతు ధర చట్టంపై కమిటీ వేయటానికి కేంద్రం రెడీ అయిపోవటంతో చాలామంది రైతులు తమ ఊర్లకు తిరిగి వెళ్ళటమే మేలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
దాదాపు ఏడాదికిపైగా జరుగుతున్న ఉద్యమంలో రైతుసంఘాల లెక్కల ప్రకారం సుమారు 700 మంది చనిపోయారు. వీరిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు చలిని తట్టుకోలేక మరణించారు. ఇంకొందరికి కరోనా వైరస్ సోకటంతో ఆసుపత్రుల్లో మరణించారు. అలాగే ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటన సందర్భంగా పోలీసు కాల్పుల్లో మరికొందరు చనిపోయారు. కాబట్టి చనిపోయిన రైతుకుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం ఇవ్వాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తోంది.