మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం బీపీ హఠాత్తుగా పడిపోవడంతో ఆయన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. రోశయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.

అజాతశత్రువుగా పేరుగాంచిన రోశయ్య మృతి పట్ట ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా రోశయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రోశయ్య చెరగని ముద్ర వేశారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థికవేత్తగా ఖ్యతి గడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన రికార్డు రోశయ్య పేరిట ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండే రోశయ్య…ఆయన మరణం తర్వాత సీఎంగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ రోశయ్య సేవలందించారు.

1994 నుంచి 1996 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా, 1978-79లో శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు. ఆర్ అండ్ బీ, హౌసింగ్, రవాణా, హోమ్, ఆర్థిక మంత్రిగా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత రోశయ్యది. రోశయ్య ఘనతను గుర్తించిన ఆంధ్రా యూనివర్శిటీ 2007లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.