ఆమె ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి వీరాభిమాని. ఆ అభిమానంతో ఆమె చేతిపై జగన్ ఫొటోను పచ్చబొట్టు వేసుకుంది. అయితే ప్రస్తుతం జగన్‌కు ఓట్లు వేసి మోసపోయామని వాపోతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని ఆమెతో పాటూ కాంట్రాక్టు కార్మికులంతా భీష్మించుకున్నారు. ఎట్టకేలకు సీఎం జగన్ వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కారిస్తామని జగన్ హామీ కూడా ఇచ్చారు. హామీ ఇస్తే సరిపోదని.. తన తలపై ఓట్టు వేయాలని జగన్ అభిమాని కోరింది. ఆమె పట్టుదలను చూసిన జగన్ ఆమె తలపై వొట్టు వేసి 24గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఆందోళనలు విరమించాలని సీఎం కోరారు.
జగన్ అభిమాని అయిన రాధ అనే మహిళ.. టీటీడీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. జగన్ చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కార్మికులందరినీ కార్పొరేషన్ (టీటీడీ పరిధిలో)లో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో కార్మికులందరూ సంతోషపడ్డారు. అప్పటికే జగన్ అభిమాని అయిన మహిళ.. ఈ హామీ ఇవ్వడంతో ఏకంగా తన చేతిపై ఆయన ఫొటోను పచ్చబొట్టు వేయించుకుంది. జగన్ సీఎం అయ్యాక శ్రీవారికి తలనీలాలు కూడా సమర్పించారు. అయితే తమకు ఇచ్చిన మాట మాత్రం తప్పారంటూ తోటి కార్మికులతో కలిసి రాధ కూడా ఆందోళన బాట పట్టింది. ఆడవాళ్ల ఉసురు ఊరికే పోదని.. ఓ దశలో జగన్ పై మండిపడ్డారు. కార్పొరేషన్‌లో విలీనం చేయాలని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికుల ఆవేదన.. చివరకు ఆగ్రహంగా మారింది.
జగన్‌పై అభిమానంతో వైసీపీకి ఓట్లు వేశామని, ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నామని రాధ వాపోయింది. జగన్ అధికారంలోకి రావాలని తమ వంతుగా ఎంతో శ్రమించామని తెలిపింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ప్రత్యక్షంగా లేరు కాబట్టి.. తన చేతిపై ఉన్న జగన్ పచ్చబొట్టుకు తన బాధనంతా చెప్పుకొని వాపోయింది. అనవరంగా ఓటు వేశామని.. ఇప్పుడు బాధ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. రాధ ఆవేదన ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.
వరద బాధితులను పరామర్శించేందుకు జగన్ ఈ రోజు తిరుపతిలో పర్యటించారు. పనిలో పనిగా టీటీడీ పారిశుధ్య కార్మికుల ఆందోళన శిబిరం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా శిబిరంలో ఉన్న రాధను కూడా జగన్ కలిశారు. చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నామని ఆమె జగన్ తో సమస్యలు ఏకరువు పెట్టింది. వారి సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారు. స్పందిస్తే సరిపోదని, తలమీద ఒట్టేయాలని జగన్ ను రాధా కోరింది. దీంతో 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని రాధా తలమీద చేయిపెట్టి జగన్ ఒట్టేశారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. రాధా తెగువను చూసిన తోటి కార్మికులు ప్రశంసలతో ముంచెత్తారు.