నోటి దురుసుతో ఆ మంత్రి అడ్డంగా బుక్క‌య్యాడే!

అధికారంలో ఉన్న‌వారికి ఉండ‌కూడంది ఏదైనా ఉంటే.. అది నోటి దురుసే!  కానీ. ఏపీలోని వైసీపీ మంత్రుల‌కు ఉన్న‌దే అది! అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఎవ‌రిని క‌దిలించినా….వైసీపీ నేతల నోటి దురుసు కామెంట్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్లే.. సోష‌ల్ మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. స‌ద‌రు మంత్రుల నోటి దురుసును బాగానే ఎండ‌గ‌డుతున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఏపీకి జీవ నాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో.. వైసీపీ ప్ర‌భుత్వం రాగానే.. అత్యుత్సాహంతో కూడిన ప్ర‌క‌ట‌న‌లు చేసింది. ముందు వెనుక ఆలోచించ‌కుండానే.. ప్రాజెక్టుపై కామెంట్లు చేసింది. ఈ క్ర‌మంలోనే ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాద‌వ్‌.. అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

2021 డిసెంబ‌రు నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. చేసి తీరుతాం.. చేస్తాం! అంటూ.. టీడీపీ నేత‌ల‌వైపు చూపిస్తూ.. కామెంట్లు సంధించారు. కానీ, ఇప్పుడు.. పోల‌వ‌రం ప‌రిస్థితి ఎలా ఉందో.. అంద‌రికీ తెలిసిందే. ఒక్క అడుగు కూడా ముందుకు సాగ‌డం లేదు. అయితే.. మంత్రి అనిల్ చెప్పిన గ‌డువు వ‌చ్చేసింది. దీంతో టీడీపీ నేత‌లు.. అనిల్ కామెంట్ల‌ను జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. అంతేకాదు.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఏడాది క్రితం టీడీపీ ఎమ్మెల్యేలు పోలవరంపై ప్రశ్నిస్తే వాళ్లను ఎద్దేవా చేస్తూ డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భీకర‌స్వరంతో శాసనసభలో ప్రకటించిన అనిల్‌ను ఇప్పుడు వారు టార్గెట్ చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గతంలో పెట్టిన డెడ్ లైన్లపై సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. మంత్రి అనిల్ కుమార్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆనాడు అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలను ఎద్దేవా చేస్తూ అన్న మాటలను ప్రస్తుతం టీడీపీ నేత‌లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. మంత్రిపై పడుతున్న పంచ్‌లు మామూలు రేంజ్‌లో లేవు.

‘ప్రాజెక్టు పూర్తి చేశారు కదా ప్రారంభిస్తున్నారా?’

‘పోలవరం పూర్తి అయిందా? ఇంకా సంగతులేంటి?. ఓపెనింగ్‌కు ఎవరొస్తున్నారు?’

 ‘డిసెంబర్ 1న నేను పోలవరం వెళ్తున్నా.. ఎవరైనా వస్తారా?’ అని సెటైర్లు పేలుస్తున్నారు.

మొత్తానికి మంత్రి అనిల్ నోటి దురుసుపై టీడీపీ నేత‌ల సెటైర్లు.. బాగా పండుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.