ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో టాలీవుడ్ లో తెలంగాణ, ఆంధ్రా హీరోలు, దర్శకులు అంటూ ప్రాంతీయ భేదాల వ్యవహారం చర్చకు వచ్చేది. కొన్ని సినిమాల్లో తెలంగాణ యాసను అవమానించారంటూ కొందరు తెలంగాణవాదులు ఆరోపించేవారు. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ, తాజాగా బిగ్ బాస్-5 షో నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది.
తెలంగాణకు చెందిన యాంకర్ రవిని అకారణంగా ఎలిమినేట్ చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక, యాంకర్ రవి బిగ్ బాస్ ఫైనల్ కు చేరుకునేంత బలమైన కంటెస్టెంట్ అని, అటువంటిది ఆయనను అప్పుడే ఎలిమినేట్ ఎలా చేస్తారని అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే షో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఈ షో ద్వారా ఆంధ్ర, తెలంగాణల మధ్య కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోందని రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ షోపై దృష్టి సారించాలంటూ ముఖ్యమంత్రి, హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని రాజాసింగ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఈ షో చూడలేమని అభిప్రాయపడ్డారు.
సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న హిందీ బిగ్ బాస్ షోలో హిందువుల మనోభావాలను కించపరిచారని రాజాసింగ్ ఆరోపించారు. వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు నిర్వాహకులు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి ఇటువంటి షోలకు అధికారులు అనుమతిస్తున్నారని విమర్శించారు.