కొండ‌ప‌ల్లి కొట్లాట‌కు తెర‌.. ముగిసిన చైర్మ‌న్ ఎన్నిక‌

మూడు రోజులుగా తీవ్ర‌ ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చైర్మన్‌ ఎన్నిక వివరాలను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం హైకోర్టుకు అందజేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు.. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. హైకోర్టు అనుమతి మేరకు విజ‌య‌వాడ పార్ల‌మెంటు స‌భ్యులు కేశినేని శ్రీనివాస్‌ ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. చెన్నుబోయిన చిట్టిబాబును తెలుగు దేశం పార్టీ.. చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించారు.

కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్‌ ఎన్నిక‌ను ఈ రోజు నిర్వ‌హించ‌డంతోపాటు.. ఎన్నికైన అభ్యర్థులతో పాటు… పిటిషనర్లకు వ్య‌క్తిగ‌త పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఉద‌యం నుంచే కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్దం 750 మంది పోలీసుల‌తో ప‌టిష్ఠ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఉన్న‌తాధికారులు సైతం రంగంలోకి దిగి ప‌రిస్థితిని అనుక్ష‌ణం ప‌ర్య‌వేక్షించారు. ఈ నేప‌థ్యంలో చైర్మ‌న్ ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రిగింది.

వైసీపీ నేతల వీరంగంతో రెండుసార్లు వాయిదా పడిన కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నెల 22 న నిర్వహించాల్సిన ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెండుసార్లు వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ కౌన్సిలర్లు, ఓ స్వతంత్ర అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కోరం ఉన్నప్పుడు ఎన్నికను వాయిదా వేయడానికి వీల్లేదని.. వైసీపీ కౌన్సిలర్లు అవరోధం కల్పిస్తున్నారనే కారణంతో రిటర్నింగ్‌ అధికారి ఎన్నికను వాయిదా వేశారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

ఆర్వో శివనారాయణరెడ్డి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంనాటి విచారణకు అత్యవసరంగా పిలిపించిన ధర్మాసనం ఆర్వోకు పలు ప్రశ్నలు సంధించింది. అడ్డుకుంటున్నారని ఎన్నిసార్లు ఎన్నికను వాయిదా వేస్తారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇంకోదానికి అనుమతించబోమని అంటే దానికీ అంగీకరిస్తారా.. అని ఆర్వో పై మండిపడింది.

కాగా, ఎన్నిక ప్ర‌క్రియ‌ను వీడియో తీయించిన అధికారులు దీంతోపాటు ఎన్నిక వివ‌రాల‌ను హైకోర్టుకు అంద‌జేయ‌నున్నారు. చైర్మ‌న్‌ ఎన్నిక ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్టు మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల‌ను పాటిస్తామ‌న్నారు.