ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై జనసేనాని పవన్ తీవ్రస్థాయిలో కామెంట్లు కుమ్మరించారు. మూడు రాజధానుల ఏర్పాటు, సి.ఆర్.డి.ఏ. రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి కూడా.. మళ్లీ ప్రజలను అయోమయంలోకి నెట్టేశారని విమర్శించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ చేస్తున్నదంతా కూడా.. కోర్టు కళ్లకు గంతలు కడుతున్నట్టుగా ఉందని దుయ్యబట్టారు. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామనడం వెనుక వ్యూహం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసులలో చురుకుగా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు.
కోర్టును పక్కదారి పట్టించేందుకే
అందుకే .. తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ఉపక్రమించిందని విమర్శించారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో జగన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకువచ్చారని పవన్ దుయ్యబట్టారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చిలకపలుకులు పలుకుతున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారా? అని నిలదీశారు.
మాటల మడమ తిరిగిందే!
“మూడు రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమలోనే వై.సి.పి. పెద్దలు మునిగి తేలుతున్నారు. రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో నాడు జరిగిన చర్చలో నాటి ప్రతిపక్ష నేతగా పాల్గొని ప్రసంగించిన జగన్ రెడ్డి తాను ఆనాడు ఏమి చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. 33 వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ లక్ష కోట్లు అవసరమవుతాయని, అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమని, మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఇంత విస్తీర్ణంలో లేదని ఇప్పుడు చెబుతున్న జగన్ రెడ్డి కనీసం 30 వేల ఎకరాలలో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే మరచిపోయారు” అని పవన్ నిప్పులు చెరిగారు.
3 వేలకు పైగా కేసులు..
రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను మందడం, రాయపూడి, చదలవాడ లాంటి చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారని పవన్ విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3 వేలకు పైగా కేసులుపెట్టారన్నారు. మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉద్యమంలో ఉన్న ఎస్.సి.లపై ఎస్.సి.లతోనే ఫిర్యాదులు చేయించి అట్రాసిటీ కేసులు బనాయించి వికృత చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే రాజధాని చాలని ఒకే మాటపై నిలవగా ఒక్క వై.సి.పి. మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందని అన్నారు.
అమరావతికే జై!
రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేయడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోందన్నారు. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధాని ఆవిర్భావానికి జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates