రాజకీయ పార్టీల్లో చేరికలు సహజమే. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు.. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటాయి. నేతలు కూడా తమకు లాభాన్ని చేకూర్చేలా ఉన్న పార్టీవైపే మొగ్గుచూపుతారు. దేశ రాజకీయాల్లో ఈ తంతు ఎప్పటి నుంచో ఉంది. తెలుగు రాష్ట్రాలేమీ అందుకు మినహాయింపు కాదు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. తనకు పోటీయే లేకుండా చేసుకోవడానికి విపక్షాల నుంచి నాయకులను పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నుంచి కొంతమంది నాయకులు ఆ పార్టీలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు ఏపీలో చేరికల కోసం బీజేపీ ప్రత్యేకంగా కమిటీలే వేస్తామనడమే హాస్యాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఎమ్మెల్సీల్లో అయితే ఒకే ఒక్కరున్నారు. నియోజవకర్గాల వారీగా క్యాడర్ కూడా అంతంతమాత్రమే. పార్టీని నడిపించే బలమైన నాయకులే కనిపించడం లేదు. బలంగా ఉండే పార్టీలో లేదా బలపడుతుందనే నమ్మకం కలిగించే పార్టీలో ఎవరైనా చేరేందుకు సిద్ధపడతారు. కానీ ఏపీలో బలహీనంగా ఉన్న బీజేపీలో చేరేందుకు ఎవరు ముందుకు వస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి.
అదీ కాకుండా పైగా ఆ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తారంటా.. ఆ కమిటీ సిఫార్సుల మేరకే చేరికలుంటాయని చెప్పడం ఇంకా కామెడీ అని విశ్లేషకులు అంటున్నారు. అసలు చేరే వారే లేరంటే? ఇక కమిటీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేరికల కోసం కమిటీ వేయలేదని చెప్తున్నారు.
ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాష్ట్ర పార్టీ నాయకులకు క్లాస్ పీకారని సమాచారం. అమరావతి రైతు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారని తెలిసింది. అందుకే చేరికలను ప్రోత్సహించాలనే ఆయన ఆదేశాల మేరకే ఇప్పుడీ కమిటీ వేసేందుకు సిద్ధమవుతోంది. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించే పెద్ద పెద్ద నాయకులతో ఈ కమిటీ చర్చలు జరిపి ఆ ప్రక్రియ స్మూత్‌గా జరిగేలా చూస్తుందని తెలిసింది.
ఇప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో అసంతృప్త నాయకులు పెద్దగా లేరు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ఆయన కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఇక జనసేన.. బీజేపీ నుంచి ఎవరైనా వస్తే చేర్చుకుందామని చూస్తోంది. అంతే కానీ ఆ పార్టీ నుంచి బీజేపీలోకి ఎవరూ రారు. ప్రధాన పార్టీలను వదిలేసి బీజేపీలో ఎవరు చేరతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.