ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందే ఈ హత్య జరగడం రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఎన్నికల్లో విజయం కోసమే ప్రణాళిక ప్రకారం జగన్ ఈ హత్య చేయించి ఆ తప్పును చంద్రబాబుపైకి నెడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించిన విషయం విదితమే. ముందు ఆయన గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చినప్పటికీ అది సహజ మరణం కాదని హత్య అని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ హత్యపై ఇప్పుడు సీబీఐ విచారణ జరుపుతోంది.
తాజాగా ఈ విచారణలో వెలువడిన అంశాలు సీఎం జగన్‌ను ఇరకాటంలో పెట్టేవిగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడీ వాంగ్మూలం ప్రకంపనలకు కారణమైంది. ఈ హత్య వెనక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్ రెడ్డి, డి. శంకర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆ వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఇప్పుడిది జగన్‌కు ఇబ్బందిగా మారింది.
మరోవైపు ఈ కేసులో ప్రమేయం ఉందని వాంగ్మూలంలో పేర్లు బయటకు వచ్చిన వ్యక్తులు ఇప్పటివరకూ దాన్ని ఖండించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. వాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మరోవైపు వివేకా హత్యతో అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ హత్యతో అవినాష్‌కు సంబంధం ఉందని నిరూపిస్తే తనతో పాటు జిల్లాలోని 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సంచలన ప్రకటన చేశారు. వైఎస్ కుటుంబానికి సంబంధం లేని ఇతరులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆరోపణలు వచ్చిన వాళ్లు మాత్రం నోరు మొదపడం లేదు. మరి వాళ్లు వ్యూహాత్మకంగానే ఇలా సైలెంట్‌గా ఉంటున్నారా? లేదా జగన్ చెప్పినట్లు చేస్తున్నారా? అనేది మాత్రం తెలియడం లేదు.
కానీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గరు వైఎస్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి తమకెలాంటి సంబంధం లేదు అని చెప్తే బాగుండూ అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చెప్పినట్లుగానే వీళ్లు కూడా బయటకు వచ్చి మాట్లాడితే జగన్‌కు కాస్త టెన్షన్ తగ్గుతుందని వాళ్లు భావిస్తున్నారు. ఎలాగో సీబీఐ దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయి. అలాంటిది వీళ్ల మౌనం వెనక అర్థమేంటీ? అని వైసీపీ శ్రేణులు జుట్టు పీక్కుంటున్నాయి.