కొన్ని సార్లు జగన్ ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. మద్యం అమ్మటం, సంక్షేమం రెండు పరస్పర విరుద్ధమైన చర్యలని అందరికీ తెలిసిందే. ఎందుకంటే మద్యం తాగటం అన్నది సంక్షేమం క్రిందకు ఏ రకంగా చూసినా రాదు. మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద కారణంగా కుటుంబాలు రోడ్డున పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల అమలు బాధ్యతలను మద్యం అమ్మకాలు, నియంత్రణ నిర్వహించే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి, చేయూత, ఆసరా లాంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకైనా చేతినిండా ఆదాయం ఉండాల్సిందే. అలాంటి ఆదాయం ఎక్సైజ్, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవిన్యు, గనులు లాంటి శాఖల ద్వారా సమకూరుతుంటాయి. ఎన్ని శాఖల నుండి ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా వేరే శాఖలుంటాయి.
అలాంటిది తాజాగా జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు, నియంత్రణ వ్యవహారాలను చూస్తున్న బేవరేజెస్ కార్పొరేషన్ కు సంక్షేమ పథకాల అమలు బాధ్యతలు అప్పగించటమే కాస్త విచిత్రంగా ఉంది. పథకాల అమలు బాధ్యతలు అప్పగించటమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలకు కూడా మద్యం ఆదాయాన్ని వినియోగంచబోతోంది. సరే ఇందులో తప్పేమీలేదని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తనిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే అధికారం ఉంది.
పలానా శాఖ నుండి వచ్చే ఆదాయాన్ని పలానా సంక్షేమ పథకానికే లేకపోతే పలానా వర్గం ప్రయోజనాలకే ఉపయోగించాలనే నిబంధన ఏమీలేదు. కాబట్టి శాఖల ఆదాయం మొత్తం ఖజానాకే చేరుతుంది. మళ్ళీ ఖజానా నుండే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు మళ్ళుతాయి. ఏ ప్రభుత్వంలో అయినా ఇంతవరకు జరుగుతున్నది ఇదే కాబట్టి ఇందులో కొత్తేమీలేదు. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం మద్యం అమ్మకాలు, నియంత్రణ వ్యవహారాలను చూసే బేవరేజెస్ కార్పొరేషన్ కే సంక్షేమ పథకాలు అమ్మే బాధ్యతలు అప్పగించటం బాగాలేదు.
ప్రభుత్వం తాజా నిర్ణయం చట్టపరంగా తప్పు కాకపోవచ్చు కానీ నైతికంగా మాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే మద్యం తాగటాన్ని మంచిపనిగా, ఆరోగ్య లక్షణంగా సమాజంలో ఎవరు పరిగణించరు. కాబట్టి తాజా నిర్ణయాన్ని ప్రభుత్వం ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates