వెంకయ్య రాజీనామా చేస్తానంటే వద్దన్నారా ?

ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసి రాజకీయాలనుండి తప్పుకుని పూర్తిగా ప్రజా సేవ చేయాలని వెంకయ్య నాయుడు అనుకుంటే ఎవరైనా వద్దన్నారా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. నెల్లూరు పర్యటనలో ఉన్న వెంకయ్య ఓ సమావేశంలో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేసి ప్రజాసేవలో పాల్గొనాలని ఉన్నట్లు చెప్పారు. జనాల్లో తిరుగుతూ జనాలకు మంచి చేయటంలో ఉన్న ఆనందం తనకు ఉపరాష్ట్రపతి పదవిలో రావటం లేదని బాధపడిపోయారు.

జనాలకు మంచిపనులు చేయటంలో ఉన్న ఆనందం రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండదని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రమంత్రిగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వెంకయ్యను నరేంద్ర మోడీ బలవంతంగా ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఓ సభలో వెంకయ్యే చెప్పారు. తాను కేంద్రమంత్రి పదవిలో ఉంటానని, ఉపరాష్ట్రపదవి వద్దని మోడికి ఎంత చెప్పినా వినకుండా తనను తీసుకెళ్లి రాజ్యాంగబద్దమైన పదవిలో కూర్చోబెట్టారని వెంకయ్య చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

అప్పటి నుంచి వెంకయ్య చాలా సభలో కాస్త అటుఇటుగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఉండటం ఇష్టం లేనప్పుడు రాజీనామా చేసేయొచ్చు. ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసేసి ఏకంగా రాజకీయాల నుండే తప్పుకుంటున్నట్లు వెంకయ్య ప్రకటిస్తే బహుశా వద్దనే వారుండరు. ఒకవైపు ఉపరాష్ట్రపతిగా ఉండటం తనకు ఇష్టంలేదని చెబుతునే తనను రాష్ట్రపతిగా చూడాలని అందరు కోరుకుంటున్నారని చెప్పటం వెంకయ్యకే చెల్లింది.

జనాల్లో స్వేచ్చగా తిరగాలని, ప్రజాసేవలో తరించిపోవాలనే కోరిక అంత బలంగా ఉన్నపుడు వెంటనే రాజీనామా చేసేసి తమ సొంత సంస్థ స్వర్ణభారతి ట్రస్టు నిర్వహణ బాధ్యతలను చేపడితే ఎంతోమంది ప్రజలకు సేవచేసే అవకాశం దక్కుతుంది. రాజకీయాల్లో వెంకయ్య సంపాదించిన అనుభవాన్ని నెల్లూరు జిల్లా, తెలుగురాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తే జనాలందరు చాలా సంతోషిస్తారు. రాజకీయ జీవితంలో దాదాపు క్లైమాక్స్ కు చేరుకున్న వెంకయ్య చివరిరోజుల్లో అయినా తన మనసుకు నచ్చినట్లు ఉండటానికి మించిన సంతృప్తి ఏముంటుంది ?