ఉవ్వెత్తున లేసే కెరటంలా ఆయన దూసుకొస్తారు.. ఆ తర్వాత ఒక్కసారిగా కిందపడే అలలా సైలెంట్ అయిపోతారు.. ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వస్తారు.. డెడ్లైన్లు పెట్టేసి సైడ్ అయిపోతారు.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఆవేశం రాగానే ప్రజల్లోకి వచ్చే ఆయన.. అది తగ్గగానే చల్లబడిపోతారనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పవన్ అధికార వైసీపీ ప్రభుత్వానికి విధించిన డెడ్‌లైన్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు.
నష్టాల పేరుతో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఆ సంస్థ కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన.. కేంద్రంలో అధికారంలో ఉన్న తన బీజేపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించింది. దీంతో బీజేపీతో పవన్ పొత్తు తెచ్చుకోవడం ఖాయమనిపించింది. కానీ విశాఖ వెళ్లి ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతున్న కార్మికులకు మద్దతుగా మాట్లాడిన పవన్.. కేంద్రాన్ని ఒక్క మాట అనకపోగా.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు కేంద్రం ముందుకు సాగుతుంటే జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం చెప్పాలని ముందుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జగన్ సర్కారుకు పవన్ వారం రోజుల డెడ్‌లైన్ విధించారు. వారం లోపు స్పందన రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు తమ కార్యచరణ ఏమిటో వెల్లడిస్తామని అప్పుడు చెప్పారు. పవన్ విధించిన ఆ డెడ్‌లైన్ ముగిసిపోయింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా.. పవన్‌పై వైసీపీ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన జగన్ ప్రభుత్వం దాన్ని కేంద్రానికి పంపించింది. మరోవైపు ప్రధానికి జగన్ లేఖలు కూడా రాశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ డెడ్‌లైన్‌పై తాము స్పందించకపోతే జనసేనాని ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలని వైసీపీ ఎదురు చూస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పవన్ విధించిన డెడ్‌లైన్ ముగిసింది. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారనే ఆసక్తి రేకెత్తుతోంది. మరోసారి వైసీపీనే విమర్శించి చేతులు దులుపుకుంటారా? లేదా? కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతారా? అన్నది చూడాలి. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని పట్టుదలతో ఉన్న జనసేనానికి ఇదో మంచి అవకాశమని విశ్లేషకులు అంటున్నారు. మరి రాష్ట్రం తరపున నిలబడి ఆయన కేంద్రంపై పోరాటంతో ప్రజల ఆదరణ పొందుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు డెడ్‌లైన్ విధించిన తర్వాత ఎప్పటిలాగే కామ్ అయిపోయిన పవన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. దీంతో మరోసారి ఆయన సైలెంట్‌గానే ఉండిపోతారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates