రైతుల క‌డుపు కొట్టి.. విజ‌య గ‌ర్జ‌న అంటారా?

అస‌లే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మితో ఢీలా ప‌డిపోయిన సీఎం కేసీఆర్‌ను ఇప్పుడు మ‌రో వివాదం చుట్టుముట్టుకుంది. ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్యూహాలు రచించినా.. కేసీఆర్ ఎన్ని ప్లాన్‌లు వేసినా ఫ‌లితం లేకుండా పోయింది. హుజూరాబాద్ ప్ర‌జ‌లు మాత్రం ఈట‌లకు అండ‌గా నిలిచారు. ఈ ఓట‌మి నుంచి ఇంకా కోలుకోక‌ముందే ఇప్పుడు కేసీఆర్‌కు మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైంది. ఆయ‌న‌పై అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా వ‌రంగ‌ల్ రైతులు టీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. న‌వంబ‌ర్ 29న టీఆర్ఎస్ త‌ల‌పెట్టిన విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌కు ఎంచుకున్న స్థ‌లమే అందుకు కార‌ణం.

టీఆర్ఎస్ 20వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఈ నెల 29న విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను భారీ స్థాయిలో నిర్వహించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఆ దిశ‌గా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ స‌భ కోసం హ‌నుమ‌కొండ జిల్లాను ఎంచుకున్నారు. అక్క‌డ స‌భ ఏర్పాటు చేసే అనువైన స్థలం కోసం ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్ భాస్క‌ర్, మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రితో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు హ‌నుమ కొండ జిల్లాలోని మామునూర్‌, రాంపూర్‌, దేవ‌న్న‌పేట‌లోని భూముల‌ను ప‌రిశీలించారు. అయితే స‌భ కోసం ప‌రిశీలించిన స్థలం ఇప్పుడు వివాదానికి కార‌ణ‌మైంది. పంటలు పండే భూముల‌ను స‌భ కోసం ఇవ్వ‌బోమ‌ని రైతులు ఎదురు తిరుగుతున్నారు. ఒక్క రోజు స‌భ కోసం హ‌ద్దులు తొల‌గించి భూమి చ‌దును చేస్తార‌ని.. ఆ త‌ర్వాత స‌రిహ‌ద్దు త‌గాదాల‌తో తాము గొడ‌వలు పెట్టుకునే ప్ర‌మాదం ఉంద‌ని రైతులు ఆ భూములు ఇచ్చేందుకు స‌సేమీరా ఒప్పుకోవ‌డం లేదు.

స్థ‌ల ప‌రిశీల‌న కోసం వ‌చ్చిన నాయ‌కుల‌కు కూడా రైతులు ఇదే విష‌యాన్ని చెప్పారు. పంట‌లు పండే భూముల‌ను ఇచ్చేదే లేద‌ని భీష్మించుకు కూర్చున్నారు. మ‌రోవైపు త‌మ భూముల‌ను స‌భ కోసం ఇవ్వ‌క‌పోతే ధ‌ర‌ణి పోర్ట‌ల్ నుంచి భూముల వివ‌రాలు లేకుండా చేస్తామ‌ని వేరొక‌రి పేర్ల మీదకు మారుస్తామ‌ని టీఆర్ఎస్ నేత‌లు బెదిరిస్తున్న‌ట్లు రైతులు చెప్తున్నారు. మొద‌ట రైతుల ఆందోళ‌న‌తో అక్క‌డి నుంచి టీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌భుత్వ అధికారులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కానీ దీపావ‌ళి పండ‌గ రోజు రైతులు ఇళ్ల‌లో ఉంటార‌ని భావించి.. ఆ స్థ‌లానికి చేరుకున్న అధికారులు స‌భ కోసం మార్కింగ్ చేశార‌ని తెలిసింది. ఈ విష‌యం తెలుసుకున్న రైతులు మ‌ళ్లీ ధ‌ర్నాకు దిగారు. భూములు ఇవ్వ‌ము మొర్రో అని మొత్తుకుంటున్నా ఎందుకు అధికారులు రైతుల‌ను బ‌ల‌వంతం చేస్తున్నార‌ని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

రైతుల ఆందోళ‌న కేసీఆర్‌కు ప‌ట్ట‌డం లేద‌ని.. రైతులు ఏమైపోతే త‌న‌కేంటి అనే విధంగా వ్య‌వ‌హ‌రిస్తూ పంటలు పండే పొలాల‌ను సభ కోసం సిద్ధం చేయిస్తున్నార‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నాయి. రాజ‌కీయాల కోసం రైతుల‌ను బ‌లి చేయొద్ద‌ని డిమాండ్ చేస్తున్నాయి. 10 ల‌క్ష‌ల మందితో టీఆర్ఎస్ ఈ స‌భ నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టింది. అందుకు 400 ఎక‌రాల ఖాళీ స్థ‌లం కావాల‌ని అంచ‌నా. కానీ ఇప్పుడేమో త‌మ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళ‌న చేస్తుండ‌డంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.