టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల పార్టీలో ఊహించని మార్పులు చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కొన్నిచోట్ల మార్పులు తప్పదనే దిశగా బాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే బాబు ఏ మాత్రం మొహమాటం పడకుండా పనిచేయని నాయకులని పక్కనబెట్టేసి కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లని పెట్టారు. తాజాగా డోన్ నియోజకవర్గ పగ్గాలను మన్నె సుబ్బారెడ్డికి అప్పగించారు.
అలాగే పనిచేయని నాయకులని మొహమాటం లేకుండా పక్కనబెట్టేసి వేరే నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే అసెంబ్లీ స్థానాలపై ఫోకస్ చేస్తున్న బాబు పార్లమెంట్ స్థానాలపై కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కేంద్రంలో సత్తా చాటాలంటే ఎంపీలు చాలా ముఖ్యం. అయితే గత ఎన్నికల్లో పార్టీకి కేవలం 3 ఎంపీలు మాత్రమే వచ్చాయి… 22 చోట్ల ఓడిపోయింది. జగన్‌కు లోక్‌సభలో 22 ఎంపీ సీట్లతో పాటు అటు రాజ్యసభలో ఎంపీలు ఉండడంతో ఇప్పుడు కేంద్రం కూడా జగన్‌తో కాస్త లాలూచీ ధోరణితోనే వెళుతోంది.
ఇక ఎంపీ సీట్లలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు పార్టీ మారిపోయారు. మరికొందరు అడ్రెస్ లేరు. అలాంటి చోట్ల వేరే నాయకులకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి సరైన నాయకులు లేరు. తూర్పులో మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి…కాకినాడ, రాజమండ్రి, అమలాపురం స్థానాలు ఉన్నాయి. దివంగత బాలయోగి తనయుడు హరీష్…అమలాపురం బాధ్యతలు చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి హరీష్ ఓడిపోయారు. ఆయన పార్టీ ఆఫీస్‌లో ఉండడం మినహా చేసేదేం లేదు.
ఇక కాకినాడలో పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ వైసీపీలోకి వెళ్లిపోయారు. అక్కడ ఎవరిని పోటీకి పెట్టాలో కూడా బాబుకు అర్థం కావడం లేదు. అటు రాజమండ్రిలో ఓడిపోయిన మురళీమోహన్ కోడలు రూప కూడా పార్టీలో కనిపించడం లేదు. ఈ రెండుచోట్ల టీడీపీకి లీడర్లు కావాల్సిందే. ఇక పశ్చిమలో నరసాపురంలో వేటుకూరి శివరామరాజు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఈయన కూడా పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈయన ఉండి అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటు ఏలూరులో ఓడిపోయిన మాగంటి బాబు..ఇప్పుడు పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. కొద్ది నెలల తేడాలోనే ఆయన ఇద్దరు కుమారుడు మృతి చెందడంతో ఆయన రాజకీయ ఇన్నింగ్స్ ముగిసినట్టే తెలుస్తోంది. ఇక్కడ కూడా టీడీపీకి లీడర్ కావాలి. పార్టీకి కాస్తో కూస్తో పట్టున్న చోటే ఈ పరిస్థితి ఉంటే సీమ, ప్రకాశం, నెల్లూరులో ఇంకెలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.