ఊహాగానాలు నిజమయ్యాయి.. అనుకున్నట్లు గానే పొత్తులో ఉన్న బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. బీజేపీ ఆశలకు పవన్ తూట్లు పొడిచారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ నాయకులు భావించారు.
కానీ పవన్ మాత్రం అలాంటిదేమీ చేయలేదు. ఆ ఉప ఎన్నికతో నేటితో ప్రచారం గడువు ముగుస్తుంది. కానీ ఇప్పటికీ పవన్ నేరుగా ప్రచారంలో పాల్గొనే దిశగా ఎలాంటి ఆసక్తి ప్రదర్శించలేదు. బీజేపీ అభ్యర్థిగా ఓట్లు వేయాలని అడుగుతూ కనీసం తన పేరుతోనైనా ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు.
అధికార వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య మరణంతో కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. వైసీపీ తమ అభ్యర్థిగా దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధను బరిలో దించింది. చనిపోయిన నాయకుడి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించడంతో ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుతూ రాజకీయ విలువలు పాటించి జనసేన పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. టీడీపీ కూడా సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెప్పి పోరుకు దూరంగా ఉంది. కానీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా ఎన్నికల పోటీలో నిలిచింది.
తమ మిత్రపక్షం జనసేన పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ తమ అభ్యర్థిని బరిలో దించిన బీజేపీ.. ఈ ఎన్నికలో తమ అభ్యర్థి తరపున పవన్ ప్రచారం చేస్తారని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. తమ పార్టీనే పోటీ నుంచి తప్పించిన పవన్.. ఇక బీజేపీ అభ్యర్థి తరపున ఎందుకు ప్రచారం చేస్తారనే అనుమానాలు కలిగాయి. కానీ పవన్ ప్రచారానికి వస్తారని.. ఆ మేరకు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ హామీ కూడా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. కానీ పవన్ ప్రచారానికి రావడం కాదు కదా.. కనీసం ఈ పార్టీ పేరుతో ఒక్క ప్రకటన కూడా విడుదల కాకపోవడం బీజేపీకి షాక్‌లా తగిలింది.
ఈ ఎన్నికలో వైసీపీ గెలుపు లాంఛనమే. కానీ గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకునేందుకే బీజేపీ తాపత్రాయపడుతోంది. ఆ దిశగా బాగానే ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ప్రచారానికి వస్తే ప్రయోజనం ఉంటుందని భావించింది. కానీ ఇప్పుడు పవన్ షాక్ ఇవ్వడంతో బీజేపీకి దెబ్బ పడడంతో పాటు పరోక్షంగా వైసీపీకి మేలు చేసినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పవన్ వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీతో బంధం తెంచుకునే దిశగా సాగుతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates