హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కష్టమేనా ? తమ గెలుపుపై కేసీయార్ అండ్ కో లో అనుమానాలు పెరిగిపోతున్నాయా ? తాజాగా నియోజకవర్గంలో ప్రకటించిన తాయిలాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ తరపున ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు విచిత్రమైన హామీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే రైతులు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.
రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోని రైతుల రుణాలు తీరుస్తామని హామీ ఇవ్వని ప్రభుత్వం ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఎందుకని హామీ ఇస్తున్నట్లు ? ఈ నియోజకవర్గంలో రైతుల రుణాలను వడ్డీతో సహా ప్రభుత్వం తీర్చటం ఖాయమైతే మరి ఇతర నియోజకవర్గాల్లో రైతు రుణాల పరిస్ధితి ఏమిటి ? అనేది ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా మొదలైన చర్చ. తాజాగా హరీష్ రావు చేసిన ప్రకటనపై రాష్ట్ర రైతాంగంలో పెద్ద చర్చ మొదలైంది. అసలు ఇలాంటి ఆచరణ సాధ్యం కాని హామీని హరీష్ ఎలా ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఉపఎన్నికలో గెలుపు విషయంలో మొదటుండి అధికార టీఆర్ఎస్ కు పెద్దగా నమ్మకం లేనట్లే ఉంది. ఎందుకంటే దళిత బంధు పథకాన్ని ప్రకటించిన కారణం కూడా ఇదే. నియోజకవర్గంలో ఉన్న 25 వేల దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఒక్క పథకం తో పని కాదన్న విషయం అర్ధమవ్వటంతో సామాజిక వర్గాల వారీగా హామీలను గుప్పిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల రూపంలో వందల కోట్ల రూపాయలను పారిస్తున్నారు.
చివరకు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు సరిపోవన్నట్లు రైతు రుణాల మాఫీ అంటు కొత్త హామీ ప్రకటించారు. ఇదే కాకుండా 57 ఏళ్ళకే పెన్షనట, 5 వేల ఇళ్ళు పూర్తిచేస్తారట, స్ధలముంటే ఇల్లు కట్టుకోవటానికి రు. 5 లక్షలు ఇస్తారని హరీష్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ప్రకటించిన హామీల్లో 57 ఏళ్ళకి పెన్షన్ తప్ప ఇంకేవీ ఆచరణ సాధ్యంకాదు. మరిలాంటి ఆచరణ సాధ్యంకాని హామీలను చాలా తేలిగ్గా ఇచ్చేస్తున్నారంటేనే ఇవేవీ అమలయ్యేవి కావని తెలిసిపోతోంది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే తమ అభ్యర్దిని ఓటర్లు గెలిపిస్తేనే పై హామీలన్నీ అమలవుతాయని హరీష్ చెప్పడం. టీఆర్ఎస్ గెలిస్తేనే హామీలు అమలవుతాయని మంత్రి చెప్పటమంటే ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే. టీఆర్ఎస్ గెలవకపోతే ఇచ్చిన హామీలేవి అమలు కావని హరీష్ పరోక్షంగా జనాలను బెదిరిస్తున్నట్లు అర్థమైపోతోంది. పైగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తానిచ్చిన హామీలను అమలు చేయగలరా అని అడగటమే విచిత్రంగా ఉంది. అధికారంలో టీఆర్ఎస్ ఉన్నపడు ప్రతిపక్షం హామీలను ఎలా అమలు చేయగలదు ? ఏమిటో హరీష్ కు కూడా మతిపోతున్నట్లే ఉంది. గెలవాలనే ఒత్తిడిలో తానేమి మాట్లాడుతున్నారో కూడా హరీష్ మరచిపోతున్నట్లున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates