హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సుమారు 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.. ఇవీ ఆ పార్టీ మాజీ మంత్రి టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడీ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. కానీ కాంగ్రెస్‌ను నిజంగానే అంత సీన్ ఉందా? అధికార టీఆర్ఎస్ నుంచి అంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
భూ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో తెలంగాణలో రగిలిన రాజకీయ వేడి ఇప్పుడు మరింత వేడెక్కెంది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఒక పార్టీపై మరో పార్టీ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. పోలింగ్‌కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది.
ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. అక్కడ ఎలాగైనా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తరపున బరిలో నిలిచిన ఈటల రాజేందర్ కూడా అస్సలు వెనక్కి తగ్గట్లేదు. విజయం కోసం శాయాశక్తులా కృషి చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ గౌరవప్రదమైన ఫలితాలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఉప ఎన్నిక వేడి నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య రహస్య భేటీ జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ఈటల, రేవంత్ వివరణ ఇచ్చుకున్నారు. తామిద్దరం కలిసింది నిజమేనని కానీ అది ఎన్నికల ప్రకటన తర్వాత కాదని చెప్పారు. కలిస్తే తప్పేంటీ అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం అదే ప్రచారాన్ని కొనసాగిస్తూ రెండు పార్టీలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పుడు కేటీఆర్‌పై మండిపడుతోన్న కాంగ్రెస్.. ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే సుమారు 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని షబ్బీర్ అలీ బాంబు పేల్చారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎంపికయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త ఆశాజనకంగా మారింది. ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్ దూసుకెళ్తున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో కాస్త వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పార్టీకి నష్టం కలిగే ప్రమాదమైతే లేదు.
ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజలను మరోసారి తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెడతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉండే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు? అన్నప్రశ్న రాకమానదు. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ తీసేందుకు ఇలా పార్టీలు మారతారనే ప్రచారం చేయడం కామనే అని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు.