బీజేపీకి జనసేన షాక్ తప్పదా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో కమలం పార్టీకి జనసేన షాక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నవంబర్ మొదటి వారంలో 12 మున్సిపాలిటీలతో పాటు వార్డులు, డివిజన్లలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ లో ఆదివారం అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన జిల్లా అధ్యక్షులు, సీనియర్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై మాట్లాడిన నేతలు తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపైన కూడా చర్చించారు. తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, చైర్మన్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని సమావేశంలో డిసైడ్ చేశారు.

ఆ మధ్య జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. అయితే బీజేపీ నేతల తీరు వల్ల జనసేన ఏ విధంగా నష్టపోయిందనే విషయాన్ని నేతలు తాజా సమావేశంలో ఉదాహరణలతో సహా వివరించారు. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పట్లోనే పవన్ మాట్లాడుతూ బీజేపీ నేతలు సరిగా పనిచేయలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఇపడు నేతలు ప్రస్తావిస్తూ బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు జరగబోయే నష్టాన్ని వివరించారట.

దాంతో అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దింపాలని పవన్ ఆదేశించినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. దీనిబట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుండదనేది అర్థమవుతోంది. ఒకవేళ కమలంపార్టీతో పొత్తుండకపోతే ఇక మిత్రపక్షాలు అనటంలో అర్ధమేలేదు. బహుశా రెండు పార్టీల మధ్య పొత్తు చత్తవటానికి మున్సిపల్ ఎన్నికల్లో వేదిక అవుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోటీ విషయంలో జనసేన క్లారిటీ తోనే ఉంది. మరి బీజేపీ అధ్యక్షుడు ఏమి ఆలోచిస్తారో చూడాలి. మొత్తానికి ఎడమొహం పెడమొహంగా ఉంటున్న మిత్రపక్షాల పొత్తుపై తొందరలోనే ఓ క్లారిటీ వచ్చేట్లే ఉంది.