ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఒక ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు.. తప్పనిసరిగా పాసులు తీసుకొని మాత్రమే ప్రయాణం చేయాల్సి వస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అంతర్ రాష్ట్ర రవాణా విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని చెప్పారు. కానీ.. కొన్ని రాష్ట్రాలు తాము ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని పాసులు లేకుండా అనుమతించమని స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నుంచి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లే వారు ఎవరైనా సరే.. ఆ రాష్ట్రం నుంచే పాసులు తీసుకోవాలని.. తెలంగాణలో ఇక నుంచి ఎలాంటి పాసులు జారీ చేయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాలంటే ఏపీ ప్రభుత్వానికి చెందిన స్పందన వెబ్ సైట్ ద్వారా పాసులు పొందాలని.. అదే సమయంలో తమిళనాడుకు వెళ్లాలంటే ఆ రాష్ట్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు.
దీంతో.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు.. ఆ రాష్ట్ర వెబ్ సైట్ లో పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా వచ్చిన ఈ మార్పును గుర్తించకుంటే మాత్రం ప్రయాణంలో తిప్పలు తప్పవు.