అందరికీ షాకిచ్చిన సోనియా

పార్టీలోనే కాదు బయటకూడా అందరికీ సోనియాగాంధీ పెద్ద షాకే ఇచ్చింది. సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతు ‘పార్టీకి పూర్తికాలపు అధ్యక్షురాలిగా తానే ఉంటాన’ని గట్టిగా చెప్పారు. తాను చురుగ్గానే పనిచేస్తున్నానని, మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం నేతలకు ఎవరికీ లేదని చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. సోనియా స్ధానంలో ఈరోజో రేపో రాహూల్ గాంధీకే మళ్ళీ పార్టీ అధ్యక్ష పగ్గాలు వస్తాయని అందరు ఎదురుచూస్తున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షునిగా రాహూల్ పగ్గాలు అందుకోవాలని అఖిల భారత యువజన కాంగ్రెస్ (ఏఐవైసీ), ఎన్ఎస్ యూఐ జాతీయ కమిటీలు ఈమధ్యనే తీర్మానాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా తీర్మానాలేవీ చేయకపోయినా కాంగ్రెస్ లోని చాలామంది సీనియర్లలో కూడా ఇలాంటి అభిప్రాయమే ఉంది. ఎందుకంటే చాలా కాలంగా సోనియాకు ఆరోగ్యం ఏమీ బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు కూడా వెళ్ళారు. ఆమధ్య యూపీలో జరిగిన ఓ ర్యాలీకి హాజరైనపుడు స్పృహతప్పిపోయారు.

ఇలాంటి అనేక కారణాలతో సోనియా అనారోగ్యం క్షీణించిపోతోంది. మునుపటిలా ఆమె జనాల మధ్యకు రాలేకపోతున్నారు. దానికితోడు కరోనా వైరస్ సమస్య కూడా తోడవ్వటంతో జనాల్లోకి రావటమే సోనియా మానేశారు. కాబట్టి ఆమె అనారోగ్యం కారణంగా పార్టీ పగ్గాలను రాహూల్ కు లేదా ప్రియాంకకు ఇవ్వటం ఖాయమని ఎవరికి వారుగా అనేసుకుంటున్నారు. అయితే పార్టీ పగ్గాలు అందుకుని సీరియస్ రాజకీయాలు చేసేంత సీన్ రాహూల్ కు లేదని మరోవైపు జనాలకే అనిపిస్తోంది.

జనాల్లో నరేంద్రమోడి సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలుస్తున్నా దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే స్ధితిలో రాహూల్ లేదని తేలిపోయింది. దాంతో పార్టీ పగ్గాల విషయంలో ఏమి జరుగుతున్నదో పార్టీ నేతలకే అర్ధం కావటంలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా ఉరుముల్లేని పిడుగుల్లాగ గర్జించారు. నాయకత్వమార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు.

పార్టీకి పూర్తికాలపు అధ్యక్షురాలిని తానేనంటు నేతలకు స్పష్టంగా చెప్పేశారు. సోనియా చేసిన తాజా ప్రకటనతో నేతల్లోనే కాకుండా పార్టీ శ్రేణులు, జనాల్లో కూడా క్లారిటి వచ్చేసినట్లే. అయితే సోనియా చెప్పినట్లు పార్టీ సారధ్య బాధ్యతలను మోయగలరా ? అన్నదే అసలైన సమస్య. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ లో మోడీ పాలనపై జనాల్లో ఉన్న వ్యతిరేకతను సోనియా ఏ మేరకు అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడాల్సిందే.