తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ సారథి.. కేసీఆర్‌ను కాకా పట్టేందుకు అధికార పార్టీ నాయకులు.. అసంతృప్తులు గత రెండు రోజులుగా టీఆర్ఎస్ భవన్‌తోపాటు.. ప్రగతి భవన్‌కు కూడా క్యూ కడుతున్నారు. మరికొందరు సిఫారసు లేఖల కోసం.. మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరు.. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ అప్పాయింట్మెంట్ కోసం.. తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. టీఆర్ఎస్‌లో కొలువుల పండగ ప్రారంభం కానుంది. మొత్తం 18 పదవులు నాయకులను ఊరిస్తున్నాయి.
దీంతో ఆయా పదవులు ఆశిస్తున్నవారు.. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌ను మచ్చిక చేసుకు నేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 18 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలోనే భర్తీ చేయనున్నారు. దీంతో ఈ పదవులు ఆశిస్తున్నవారు.. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాస్తవానికి జూన్ నుంచి ఆరు ఖాళీలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ కోటా నుంచి మండలికి గతంలో ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం జూన్ మూడో తేదీతో ముగిసింది.
వాస్తవానికి ఆ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ రెండో వేవ్ కారణంగా అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా నేపథ్యంలో నిర్దిష్ట గడవులోగా ఎన్నికలు నిర్వహించలేకపోతున్నా మని, ఎప్పుడు నిర్వహించేది తదుపరి ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ప్రకటించింది. అయితే… ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో అంటే.. నవంబరు మూడో వారంలో లేదా నాలుగో వారంలో మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే నేతల దూకుడు పెరిగింది.
అదేసమయంలో మండలి ఛైర్మన్తోపాటు డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం కూడా జూన్ మూడో తేదీన పూర్తైన నేపథ్యంలో ప్రస్తుతం ప్రొటెం ఛైర్మన్గా భూపాల్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగితే కొత్త ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు కూడా నిర్వహించవచ్చని అంటున్నారు. ఇక, వచ్చే జనవరి నెలలో మరో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 12 మంది పదవీకాలం 2022 జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.
హైదరాబాద్ జిల్లాకు చెందిన రెండు మినహా స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఖాళీ కానున్నాయి. పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. ఈ స్థానాలకు కూడా భారీగానే పోటీ నెలకొంది. కవితను దాదాపు మళ్లీ ఖరారు చేయనున్నా.. మిగిలిన 17 పదవులు ఎవరికి ఇస్తారనే విషయం ఆసక్తిగా మారింది. మరి ఈ పోటీలో చాలా మంది పెద్దలే ఉండడంతో.. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది.