మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దశ తిరగనుందా? ఆయనకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పదవి అప్పగించనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లికి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తుండడమే అందుకు కారణం. తాజాగా ఆయనను కేసీఆర్ అసెంబ్లీకి తీసుకుని వెళ్లారు. సభ అయిపోయేంత వరకూ మోత్కుపల్లి సీఎం కార్యాలయంలోనే ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ వెంట ప్రగతిభవన్‌కు వెళ్లారు. దీంతో దళిత బంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆ పథకం అమలు తదితర వ్యవహారాల పర్యవేక్షణ కోసం మోత్కుపల్లికి కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారని సమాచారం.
దళిత బంధు పథకాన్ని విడతల వారీగా రాష్ట్రంలోని దళితులందరికీ అందిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. అయితే ఈ పథకానికి ఓ చట్టబద్ధత తీసుకు వచ్చి దాని అమలు కోసం ఓ ఛైర్మన్ పదవి ఏర్పాటు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ ఛైర్మన్ పదవిని మోత్కుపల్లికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గతంలో దళిత బంధు సమీక్షా సమావేశంలోనూ మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో సీఎం కేసీఆర్ పక్కనే కూర్చోవడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనకు కీలక పదవి రాబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో దళిత బంధు మీద చర్చ సందర్భంగా మోత్కుపల్లిని కేసీఆర్ తీసుకొని వెళ్లారు. దీంతో దళిత బంధు అమలు కమిటీ ఛైర్మన్ పదవిని మోత్కుపల్లికే ఇచ్చేలా కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతే కాకుండా మోత్కుపల్లి త్వరలోనే కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. ఈ సమయంలోనే మోత్కుపల్లికి ఇవ్వనున్న కీలక పదవి గురించి కేసీఆర్ ఓ ప్రకటన చేసే ఆస్కారముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయల్లో ఎంతో సీనియర్ అయిన మోత్కుపల్లి దశాబ్దం కిత్రమే మంత్రి పదవి దక్కించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలో చక్రం తిప్పారు. 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ తరపున పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన.. ఇప్పుడు తిరిగి కారెక్కనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates