ఈ మధ్య తెలుగు సినిమా వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల ధరలు, అదనపు షోలు లాంటి విషయాల్లో ప్రభుత్వం నియంత్రణ తీసుకురావడాన్ని ఇండస్ట్రీ జనాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కానీ తమ అసంతృప్తిని బయటికి వెళ్లగక్కే సాహసమే చేయలేకపోతున్నారు. ఈ విషయం ఇలా ఉంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కూడా రాజకీయ రంగు పులుముకోవడం చర్చనీయాంశంగా మారింది.
మెగా ఫ్యామిలీ మద్దతుతో ప్రకాష్ రాజ్ ప్యానెల్, వైసీపీ మద్దతుదారుగా గుర్తింపున్న మంచు విష్ణు బృందం మా ఎన్నికల్లో తలపడుతుండటంతో ఈ ఎన్నికలు పరోక్షంగా జనసేన వెర్సస్ వైసీపీ పోరుగా మారాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని.. ఈ ఎన్నికల విషయమై తాజాగా చేసిన ప్రకటన ఆసక్తి రేకెత్తించింది.
ఈ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గానీ, వైఎస్సార్ కాంగ్రెస్‌కు కానీ ఎలాంటి సంబంధం లేదని.. ఈ ఎన్నికల పట్ల తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి ఉత్సాహం లేదని ఆయన ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఈ ఎన్నికలతో వైసీపీకి సంబంధం ఉందని ఎవరంటున్నారు.. ఇప్పుడు పనిగట్టుకుని నాని ఈ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు జనాల నుంచి తలెత్తుతున్నాయి.
పేర్ని నాని స్టేట్మెంట్ కింద ట్విట్టర్లో చేసిన కామెంట్లన్నీ ఇలాగే ఉన్నాయి మరి. సంబంధం లేదంటే సైలెంటుగా ఉండాలి కానీ.. మాకు సంబంధం లేదు అని పర్టికులర్‌గా అనడం ద్వారా నిజంగానే సంబంధం ఉందని జనాలు అనుకునేలా చేశారనే కామెంట్లు పడుతున్నాయి. మంచు ఫ్యామిలీకి వైసీపీతో ఉన్న కనెక్షన్.. ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉందన్న అభిప్రాయాల కారణంగా ఈ ఎన్నికల్ని జనసేన వెర్సస్ వైసీపీ పోరుగా చూస్తున్న నేపథ్యంలో ఒకవేళ విష్ణు ఎన్నికల్లో ఓడిపోతే జనాలు తమ వైఫల్యంగా భావిస్తారేమో అన్న ఆందోళనతోనే నాని ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి.