థియేటర్ లో తొలిసారి సినిమా చూసిన ఎమ్మెల్యే సీతక్క

సినిమా అన్నది తల్లి పొత్తిళ్లతోనే మొదలవుతుంది తెలుగువారికి. చంటి పిల్లల్ని భుజాన ఎత్తుకొచ్చి థియేటర్ లో సినిమాలు చూసే తల్లులు చాలామందే కనిపిస్తారు.అలా పరిచయమైన థియేటర్.. ఆ తర్వాత తన సమ్మోహన శక్తితో తరచూ లాగేస్తుంటుంది. సినిమా చూసే రెండున్నర గంటల పాటు తమను తాము మర్చిపోయేలా సరికొత్త అనుభూతిని ఇచ్చే మేజిక్ దాని సొంతం. అలాంటి మేజిక్ ను..కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇప్పటివరకు చూడలేకపోవటం నిజంగానే విచిత్రం. మన చుట్టూ రాజకీయ నేతలు చాలామంది ఉన్నా.. వెనుకబడిన వారు.. గిరిజనుల కోసం.. వారి హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాడే ఎమ్మెల్యే సీతక్క లాంటి వారు సినిమాల్ని చూడరు.

అయితే.. తాను థియేటర్ కు వచ్చి సినిమా చూడటం ఇదే తొలిసారి అని చెప్పినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. గత వారం విడుదలై.. మౌత్ టాక్ తో కలెక్షన్లు పెరుగుతున్న రిపబ్లిక్ మూవీని ఆమె తాజాగా చూశారు. తాను థియేటర్ లో చూసిన తొలి సినిమా అని చెప్పుకొచ్చారు. సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. కీలకమని చెప్పాలి.

ఆమె ఏం చెప్పారన్నది ఆమె మాటల్లోనే వింటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. సినిమాకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా చూసిన తరువాత గుండె బరువెక్కింది. నాకు ఓ చరిత్ర, ఘటన గుర్తుకు వస్తుంది. బ్రిటీష్ పరిపాలన‌కు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీని.. ఓ గాడ్సే రూపంలో చంపేస్తే.. అలానే ఓ అధికారి ప్రజల బాధలను తొలగిస్తే.. వారే మళ్లీ తిరిగి అధికారిని చంపడం వంటి ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూడాలి. రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రజల్లోనూ మార్పులు రావాలి. ప్రతీ ఒక్కరిలో మార్పులు వస్తే మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోగలం. ప్రజలు, మాలాంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా సినిమాను చూసి మార్పును కోరుకోవాలి’ అని పేర్కొన్నారు. మొత్తానికి థియేటర్లో సీతక్క చూసిన మొదటి సినిమాను.. దాని అనుభూతిని మాత్రం ఎప్పటికి మర్చిపోలేరేమో?