2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారా? ఆ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆ దిశగానే త్వరలో ప్రకటించబోయే మంత్రివర్గంలో మార్పులు ఉండనున్నాయా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరో ఏడాదిన్నర ఆగితే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. దీంతో ఆ లోపే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వేటుపడే మంత్రులకు ఆయన కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని 2019 మేలో అధికారం చేపట్టినపుడే జగన్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు కేబినేట్ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. ఈ డిసెంబర్‌లో కొత్త మంత్రులు జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాంతాలు, వర్గాలు, సామాజిక సమీకరణాలు ఇలా ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుని జగన్ కొత్త మంత్రివర్గం జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడున్న మంత్రివర్గంలో దాదాపు 90 శాతం పైగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దీంతో పదవులు వదులుకునే మంత్రులకు అప్పగించాల్సిన బాధ్యతలపై చర్చ సాగుతోంది. తన కేబినేట్ నుంచి వెళ్లిపోయే మంత్రులతో పాటు కొత్తగా వచ్చే వాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
పదవులు కోల్పోయిన మంత్రులందరూ పార్టీ సేవకు అంకితం కావాల్సిందేనని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. వీళ్లకు గతంలో తయారు చేసుకున్న పార్టీ పార్లమెంటరీ జిల్లాల ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఈ పార్లమెంటరీ జిల్లాల్లో వైసీపీ గెలుపు బాధ్యతను ఈ మంత్రులే తమ భుజాలపై వేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎమ్యేల్యేల గెలుపు బాధ్యత వీళ్లదే. ఇక కొత్తగా వచ్చే మంత్రులపై తమ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల గెలుపు బాధ్యతలను జగన్ కట్టబెట్టనున్నారని సమాచారం. ఒకవేళ వీళ్లు ఎంపీలను గెలిపించడంలో విఫలమైతే ఏం చేయాలన్న దానిపై మరో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా మేరకే జగన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కొత్తగా ప్రకటించే మంత్రివర్గంలో మార్పులపై తాజాగా ఎంపీలతో నిర్వహించిన సమీక్షలో జగన్ వాళ్ల అభిప్రాయాలను స్వీకరించారు. దీంతో జిల్లాల్లో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. వాళ్ల మధ్య సమన్వయం కోసమే ఈ సారి ఎంపీలు చెప్పినవాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates