ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయిస్తుందంటూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అన్నదమ్ములు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య మంటకు కారణమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ మంత్రులు ఆ దిశగా ఈ అవకాశాన్ని వాడుకుంటున్నరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై పవన్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం రోజురోజుకు చిలికి చిలికి గాలివానలా మారుతోంది.
సినీ పరిశ్రమలో మెగాస్టార్‌కు శిఖరాగ్రానికి చేరిన చిరంజీవి.. ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో అడుగుపెట్టి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ యువజన విభాగం బాధ్యతలను అప్పుడు పవన్ చూసుకున్నారు. కానీ 2009 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించడంలో పార్టీ విఫలమైంది. దీంతో 2011లో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన చిరంజీవి రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పవన్‌కు అప్పుడు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి ఈ అన్నదమ్ముల మధ్య దూరం వచ్చిందనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు తాజాగా టికెట్ల వ్యవహారం కారణంగా చిరంజీవి, పవన్ మధ్య మంట పెట్టేందుకు వైసీపీ మంత్రులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు చిరంజీవి తనతో చెప్పారని మంత్రి పేర్ని నాని వెల్లడించడమే అందుకు కారణం.
పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని నాని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలతో పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని చిరు అన్నారని నాని చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకలో పవన్.. తన అన్నయ్య ఇలా మంచితనంగా.. మెతకగా ఉంటూ జగన్ ప్రభుత్వానికి విన్నవించుకోవడం సరికాదంటూ అర్థం వచ్చేలా మాట్లాడారు.
ఇప్పుడిక ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావించిన ఏపీ మంత్రులు.. పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని కావాలనే చెప్పారని జనసేన వర్గాలు అంటున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి పెరిగింది.