ప్రజలే జగన్‌పై దాడి చేస్తారు-ఏపీ డిప్యూటీ సీఎం


బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నపుడో.. మీడియా ముందు మాట్లాడుతున్నపుడో నాయకులు నోరు జారడం మామూలే. గతంలో దీని గురించి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు పట్టుకుని నానా యాగీ చేయడం ఎక్కువైపోయింది. ఆ తడబాటు ఆధారంగా కొందరు నేతల ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది.

ముఖ్యంగా కేంద్రంలో రాహుల్ గాంధీ.. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్.. ఇలా కొన్ని సందర్భాల్లో నోరు జారి ప్రత్యర్థులకు టార్గెట్ అయిపోయారు. వాళ్లపై ‘పప్పు’ అని ముద్ర వేసేసి వ్యక్తిత్వ హననం ఓ రేంజిలో చేశారు ప్రత్యర్థులు. ఈ విషయంలో అందరి కంటే వైసీపీ వాళ్లు రెండాకులు ఎక్కువే చదివారని చెప్పొచ్చు. నారా లోకేష్‌తో పాటు పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో తడబడ్డ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వాళ్లు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడు అదే బూమరాంగ్ అవుతోంది.

గత రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా నాయకులు సభల్లో, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు చాలా సందర్భాల్లో తడబడ్డారు. దీంతో ప్రత్యర్థులు వీరి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా మరో వైకాపా నేత మాట తడబడి సోషల్ మీడియాకు టార్గెట్‌గా మారారు. ఆయనే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఆయన బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్న అనంతరం రాజకీయాలపై మాట్లాడారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు.

ఐతే ఆయన్ని తిట్టబోయి తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేసేశారు. ‘‘అతనొక వ్యక్తి అయితే పర్వాలేదు. లేడీస్‌ని దెబ్బ తీసిన వ్యక్తి. లేడీస్‌ని ఏ విధంగా అన్యాయం చేశాడో తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏందండీ దాడి చేసేది. ప్రజలే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే రోజు రాబోతున్నది. జగన్మోహన్ రెడ్డేందండీ దాడి చేసేది. ప్రజలే దాడి చేసే రోజొస్తుంది’’ అన్నారు నారాయణస్వామి. ఈ వీడియోను జనసేన, టీడీపీ వాళ్లు వైరల్ చేస్తూ జగన్ గురించి ఆ పార్టీ ముఖ్య నేతే భలే చెప్పారంటూ కౌంటర్లు వేస్తున్నారు.