పవన్.. పోసాని.. మధ్యలో ఇండస్ట్రీ

జరిగింది ఓ సినిమా ఈవెంట్. కానీ అక్కడ అనుకోకుండా రాజకీయాల గురించిన ప్రస్తావన వచ్చింది. అది కాస్తా ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారింది. సాయిధరమ్ తేజ్ రాలేని క్రమంలో సినిమాని ప్రమోట్ చేసేందుకు పవన్‌ని ఆహ్వానించింది ఆ మూవీ టీమ్.

కానీ ఆయన ఆ విషయాన్ని విస్మరించి తన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారనే కామెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. తేజ్‌ యాక్సిడెంట్‌ గురించి మీడియా తప్పుగా ప్రచారం చేసిందనే కోపంతో స్పీచ్ మొదలుపెట్టిన పవన్ దాన్ని కాస్తా ఏపీ రాజకీయాల వైపు తిప్పారు. దాంతో రచ్చ మొదలైంది.

ఇండస్ట్రీలో కొందరు పవన్‌కి మద్దతు తెలిపారు. ఆయన మాటల్లో ఏ తప్పూ లేదన్నారు. కానీ కొందరు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. థియేటర్లు, టికెట్ ధర పెంపు వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వంతో చర్చలు శాంతియుతంగా జరిగి, పరిస్థితులు సానుకూలంగా మారుతున్న సమయంలో పవన్‌ అలా మాట్లాడటం కొందరికి రుచించలేదు. దాంతో పవన్ మాటలతో తమకు సంబంధం లేదని ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌ వెంటనే ప్రకటించింది. ఈ విషయంలో మరికొందరు నిర్మాతలు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు పోసాని చేస్తున్న వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి మరో పెద్ద డిస్టర్బెన్స్ అయ్యింది. పోసాని చిన్న వ్యక్తేమీ కాదు. ఎన్నో యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మంచి రచయిత. బిజీ ఆర్టిస్ట్. ఇక పవన్‌ స్టార్ హీరో. బాక్సాఫీసును శాసించే సత్తా ఉన్నవాడు. వీళ్లిద్దరూ ఇలా ఒకరినొకరు విమర్శించుకోవడం చాలామందిని బాధ పెడుతోంది. దీనివల్ల పవన్‌ కెరీర్‌‌కి పెద్ద నష్టమేమీ ఉండకపోవచ్చు. కానీ పోసాని కెరీర్‌‌కి మాత్రం ఇదంత మంచిది కాదనే వాదన వినిపిస్తోంది.

జగన్‌కి మద్దతుగా మాట్లాడటం వల్ల రాజకీయ ప్రయోజనాలు చేకూరతాయేమో కానీ, సినీ పరిశ్రమలో పోసానికి చుక్కెదురయ్యే ప్రమాదం లేకపోలేదంటున్నారు. మొత్తంగా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఇలా దూషించుకోవడం మాత్రం ఎవరికీ రుచించడం లేదు.