కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం విరాళాల సేకరణకు ప్రధాని నరేంద్ర మోడీ 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వచ్చిన విరాళాలను కరోనాపై పోరాటంలో ఖర్చు చేస్తామని ప్రకటించారు. ప్రధాని పిలుపునకు స్పందించిన ఎంతో మంది బడా వ్యాపారవేత్తలు సినీ రాజకీయ ప్రముఖులు మొదలు సాధారణ ప్రజల వరకూ డబ్బులు డొనేట్ చేశారు. దీంతో అసలు పీఎం కేర్స్‌కు ఎంత విరాళాలు వచ్చాయి? ఇప్పటివరకూ ఎంత ఖర్చు పెట్టారో? తెలుసుకోవాలనే కుతూహలం కలగడం సహజమే. దీంతో సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఈ పీఎం కేర్స్‌ను తీసుకురావాలని ఓ వ్యక్తి కోరితే.. అసలు పీఎం కేర్స్ అనేది ప్రభుత్వ నిధి కానే కాదని ఆ విరాళాలు దేశ ఖజానాలో జమ కావని ప్రధాన మంత్రి కార్యాలయం అధికారి ఒకరు సమాధానం ఇవ్వడం విశేషం.
పీఎం కేర్స్‌ను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ సమ్యక్ గంగ్వాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ అమిత్ బన్సల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే ఇప్పుడీ పిటిషన్‌కు సమాధానంగా ప్రధానమంత్రి కార్యాలయం హైకోర్టులో ప్రమాణ పత్రం సమర్పించింది.
దీనికి సంబంధించిన వివరాలను పీఎం కేర్స్ ట్రస్టులో గౌరవపూర్వక విధులు నిర్వర్తిస్తున్న పీఎంవో అండర్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఈ విషయాలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం పీఎం కేర్స్ అనేది ప్రభుత్వ సంస్థ అవునా? కాదా? అన్న దానితో పటిషనర్‌కు సంబంధం లేదని విరాళాలు ఇచ్చిన వ్యక్తుల వివరాలు వెల్లడించబోమని ఇది ప్రభుత్వ నిధి కాదని ఆ డబ్బు ప్రభుత్వ ఖజనాలో జమ కాదని పేర్కొన్నారు.
దీంతో అది ప్రభుత్వ సంస్థ కానప్పుడు ఆ వెబ్సైట్లో ప్రధాని మోడీ ఫోటోను దేశ అధికారిక చిహ్నాన్ని ఎందుకు వాడుతున్నారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ వెబ్సైట్లకు వాడే .గవ్ అనే డొమైన్‌ను ఈ వెబ్‌సైట్‌కు వాడడం మానుకోవాలని అన్నారు. ప్రధాని రక్షణ మంత్రి హోం మంత్రి ఆర్థిక మంత్రి దీని ధర్మకర్తలుగా ఉన్నారని దీన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్లుగా ప్రజల్లో అభిప్రాయాన్ని కలిగించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో పీఎం కేర్స్ వ్యవహారాలపై మరింత అనుమానాలు కలిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ పీఎం కేర్స్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఇది ప్రభుత్వ సంస్థ ఎందుకు కాకూండా పోతుందనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. దీనిపై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.