కరోనా వైరస్‌ను ప్రభుత్వాలు, జనాలు ఎంత లైట్ తీసుకుంటే అది అంతగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వందలు, వేలల్లో కేసులు నమోదవుతున్నపుడు రోజూ పదుల సంఖ్యలో కేసులతో తెలంగాణలో అదుపులోనే ఉన్నట్లు కనిపించిన వైరస్.. కొన్ని రోజులుగా తన ఉద్ధృతి చూపిస్తోంది.
ఇటీవలే ఒక్క రోజులో 169 కేసులతో హైయెస్ట్ సింగిల్ డే రికార్డ్ నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం మధ్య ఏకంగా 199 కేసులు నమోదయ్యాయి తెలంగాణలో.
ఇది కొత్త రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో 196 కేసులు తెలంగాణలో నమోదైనవే కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలసదారులు ముగ్గురు కరోనాతో ఇక్కడ అడుగు పెట్టారు.
ఎప్పట్లాగే మెజారిటీ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనివే. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 122 కేసులు బయటపడగా.. రంగారెడ్డిలో 40 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల వ్యవధిలో ఐదుగురు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 82గా ఉంది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2700 దాకా ఉన్నాయి. అందులో 1500 మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1200 దాకా ఉన్నాయి. ఇక ఆదివారం ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు భారీగానే నమోదయ్యాయి.
మొత్తం కేసులు లక్షా 80 వేల మార్కును దాటేశాయి. మరణాలు 6 వేల దాకా ఉన్నాయి. కరోనా ధాటికి అత్యధిక ప్రభావం పడ్డ దేశాల జాబితాలో భారత్ స్థానం ఇప్పుడు ఏడుకు పెరిగింది. చైనా సహా చాలా దేశాల్ని దాటి భారత్ ముందుకెళ్లిపోయింది.