అమిత్ షా గురి తప్పిందా ?

నిర్మల్ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలు వింటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు అమిత్ నిర్మల్ బహిరంగ సభలో ఎందుకు పాల్గొన్నారు ? ఎవరిని టార్గెట్ చేయడానికి వచ్చారు ? ఎవరిని టార్గెట్ చేశారు ? అనేది జనాలకు అర్థం కావట్లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని ఒకటికి పదిసార్లు గట్టి గట్టిగా అరిచి ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా కమలనాథులు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ నిర్మల్ సభలో మాట్లాడిన షా మాత్రం కేసీయార్ ను టార్గెట్ చేయకుండా ఎక్కువగా మజ్లిస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ను వదిలిపెట్టి ఎంఐఎంను టార్గెట్ చేస్తే బీజేపీకి వచ్చే లాభం ఏమిటో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నది కేసీయారే కానీ మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ అయితే కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఓల్డ్ సిటీ లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు+ఒక ఎంపీ సీటులో మాత్రమే గెలిచిన మజ్లిస్ ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏమయి ఉంటుంది ?

ఒకవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డైరెక్టుగా కేసీయార్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళద్దరి టార్గెట్ లో మజ్లిస్ ను కానీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కాని పెద్దగా పట్టించుకోవటంలేదు. కారణం ఏమిటంటే పైన చెప్పుకున్నట్లుగా ఎంఐఎంను టార్గెట్ చేయటం ద్వారా తమ ఎనర్జీని వేస్టు చేసుకోవడం ఇష్టం లేన్నట్లుంది. అలాంటిది స్దానిక నేతలకున్న పరిజ్ఞానం కూడా అమిత్ షా కు ఉన్నట్లు లేదు. లేదా వ్యూహాత్మకంగా కేసీయార్ ను వదిలిపెట్టేశారా అన్నది అర్థం కావడం లేదు.

ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతున్న విషయం ఏమిటంటే కేసీయార్ ను మాత్రం హోంశాఖ మంత్రి టార్గెట్ చేయటానికి ఇష్టపడలేదని. ఈమధ్యనే వారం రోజులపాటు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన కేసీయార్ వరుసబెట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు చాలామంది కేంద్రమంత్రులను కలిసొచ్చారు. అమిత్ తో రెండు మూడు సార్లు కలిసారు. దీనిబట్టి మోడీ, అమిత్ తో కేసీయార్ కు మంచి సంబంధాలున్నట్లు అర్ధమైపోతోంది.

అందుకనే టార్గెట్ చేయాల్సిన కేసీయార్ ను వదిలిపెట్టి సంబంధంలేని మజ్లిస్ ను టార్గెట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్నీ పార్లమెంటు స్ధానాల్లో గెలుస్తామని చెప్పిన అమిత్ అసెంబ్లీ సీట్ల విషయం మాత్రం మాట్లాడలేదు. అసెంబ్లీ సీట్లలో గెలిస్తేనే లోక సభ సీట్లలో విజయం సాధ్యమని తెలిసి కూడా రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని అమిత్ స్పష్టంగా చెప్పలేదు. దాంతోనే తాజా పర్యటనలో అమిత్ తన గురి తప్పినట్లే అర్ధమవుతోంది.