మెడికల్ సీటు ఏపీలో ఇక చీపు … కానీ ట్విస్టుంది

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు వార్షికోత్సవం జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభ వార్త చెప్పింది. రాష్ట్రంలో మెడిసిన్ ఫీజులను భారీగా తగ్గించింది. ఆ తగ్గింపు దాదాపు 40 శాతం కావడం విశేషం. ప్రస్తుతం మెడికల్ సీటు కన్వీనర్ కోటా ఫీజు రూ.7.60 లక్షలుగా ఉండగా ఆ మొత్తాన్ని ఒకేసారి రూ.4.32 లక్షలకు తగ్గించారు.

ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం.. విద్యార్థుల గురించి ఆలోచించకుండా యాజమాన్యాలకు మేలు చేకూర్చేలా మెడికల్ విద్య ఫీజులను భారీగా పెంచింది. 2017-18 విద్యా సంవత్సరంలో ఫీజులు అమాంతం పెరిగిపోయాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా తెదేపా సర్కారు పట్టించుకోలేదు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఫీజులను గణనీయంగా తగ్గించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు చేసేలా ఫీజులను నిర్ధారించారు. డెంటల్ మెడికల్ కాలేజీ ఫీజులను ఇదే తరహాలో తగ్గించారు. ఐతే కొత్త ఫీజులు వెంటనే అమలు కావడం లేదు. అందుకు ఇంకో మూడేళ్ల సమయం పట్టనుంది. 2023 నుంచి ఈ ఫీజులను వర్తింపజేయనున్నారు. ఈ విషయంలో జగన్ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఇప్పుడే ఫీజులు తగ్గిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆ విషయం ప్రజలకు గుర్తుండదని భావించి.. ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు తగ్గింపు ఫీజులను అమలు చేయడం ద్వారా ప్రయోజనం పొందాలని భావిస్తున్నట్లుంది. సంక్షేమ పథకాల అమలుతో ఓటు బ్యాంకును బలపరుచుకుంటున్న జగన్.. ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే అన్నది మరోసారి రుజువైంది.