ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకున్న ఏకే గోస్వామిని 8 నెలలకే బదిలీ చేస్తున్నారు. మామూలుగా ఇలా జరగదు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ గా నియమితులైన వ్యక్తి సీటులో సెటిల్ అవటానికే కనీసం ఆరు మాసాలు పడుతుంది. తాను బాధ్యతలు స్వీకరించేనాటికి హైకోర్టులో విచారణ జరుగుతున్న, పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కీలకమైన కేసుల గురించి తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
తాను విచారించాల్సిన కేసుల విషయంలో ఏ చీఫ జస్టిస్ అయినా ముందుగా బాగా స్టడీ చేస్తారని అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఏకే గోస్వామి బాధ్యతలు తీసుకునే సమయానికే మూడు రాజధానుల సమస్య, రాజధాని అమరావతి వివాదం కేంద్రంగా దాఖలైన అనేక కేసులు విచారణకు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో రోజువారి విచారణ చేపడతామని గోస్వామి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
రాజధాని కేసుల విచారణను వచ్చే నవంబర్ కు వాయిదా వేశారు. గోస్వామి ముందు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జేకే మహేశ్వరి కూడా మూడు రాజధానుల వివాదం, అమరావతి వివాదాలను ప్రాధాన్యత క్రమంలో విచారిస్తామని చెప్పారు. అయితే హఠాత్తుగా బదిలీ అయిపోవటంతో గోస్వామి వచ్చారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఇంకా ముఖ్యమైన వివాదాలకు సంబంధించిన కేసులపై పూర్తి స్థాయి విచారణను చేపట్టనేలేదు. ఇంతలోనే బదిలీ అయిపోతున్నారు. గోస్వామి ప్లేసులో ప్రశాంతకుమార్ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.