లైట్ తీసుకున్నాం.. విధ్వంసం జరుగుతోంది

దేశవ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ నామమాత్రంగా నడుస్తోంది. లాక్ డౌన్ నుంచి మినహాయింపులు రాగానే కరోనా ప్రభావం తగ్గిపోయిందేమో అన్నట్లుగా జనాలు వైరస్‌ ప్రమాదాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు రోజుకు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతుంటే.. ఒకరిద్దరు చనిపోతుంటేనే వణికిపోయిన జనాలు.. ఇప్పుడు వందలు వేలల్లో కేసులు వెలుగు చూస్తున్నా, పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నా మామూలు విషయం లాగే చూసే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. నిన్న, శుక్రవారం పలు రాష్ట్రాల్లో హైయెస్ట్ సింగిల్ డే కేసులు నమోదయ్యాయి. ఆ జాబితాలో తెలంగాణ సైతం ఉంది. దేశంలోనే అతి తక్కువగా కరోనా టెస్టులు చేస్తున్న తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 169 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఇప్పటిదాకా తెలంగాణలో ఏ రోజూ వందకు పైగా కేసులు నమోదు కాలేదు.

నిన్న దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు హైయెస్ట్ సింగిల్ డే కేసులతో రికార్డులు నమోదు చేశాయి. మహారాష్ట్రలో ఏకంగా 2600కు పైగా కేసులు బయటపడటం గమనార్హం. తమిళనాడులో 800కు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్న ఒక్క రోజే 8 వేలకు పైగా ఉండటం గమనార్హం. ఇప్పటిదాకా ఏ రోజూ 8 వేల మార్కుకు చేరలేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజే 150 మందికి పైగా చనిపోయారు.

మొత్తం మరణాల సంఖ్య 5 వేల మార్కును టచ్ చేసింది. ఐతే కొంత ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. నిన్న రికార్డు స్థాయి కేసులే కాదు.. రికార్డు స్థాయి రికవరీలు కూడా ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే 11 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా దేశంలో కరోనా కేుసులు 1.73 లక్షలకు పైగా ఉండగా అందులో 90 వేల మంది దాకా కోలుకున్నారు. కానీ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమే.