విజ‌య్ ఒంట‌రి పోరే… ఛాన్స్ లాగేసిన సీఎం!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపు తిరిగింది. వ‌చ్చే ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. ఒంట‌రి పోరు చేస్తామంటూ.. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు చెప్పుకొచ్చిన న‌టుడు విజ‌య్ ప్ర‌క‌టించారు. ఈయ‌న స్థాపించిన త‌మిళ వెట్రి క‌గ‌ళం(టీవీకే) పార్టీ ఒంట‌రి పోరునే ఎంచుకుంద‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. త‌మిళ ప్ర‌జ‌ల కోసం.. నిల‌బ‌డ‌తామ‌ని కూడా తెలిపారు. అయితే.. ప‌రిణామాలు అన్నీ ఒకేలా ఉండ‌వు క‌దా.. బీజేపీ స‌హా.. అధికార పార్టీ డీఎంకే కూడా దూకుడుగా ఉండ‌డంతో విజ‌య్ కొంత యూట‌ర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లిపేందుకు ప్ర‌య‌త్నించారు.

విజ‌య్ ప్ర‌య‌త్నాల‌కు కాంగ్రెస్ పార్టీ కూడా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెర‌చాటున ఓకే చెప్పింది. నిజానికి ప్ర‌స్తుత అధికార పార్టీ డీఎంకేతో కాంగ్రెస్ క‌లిసే ఉంది. అధికారం కూడా పంచుకుంది. కానీ.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి సీట్ల వ్య‌వ‌హారంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య పేచీ చోటు చేసుకుంది. మ‌రోవైపు నాలుగు రాజ్య‌స‌భ‌సీట్లు త‌మిళ‌నాడులో ఖాళీ అవుతున్నాయి. ఈక్ర‌మంలో ఈ సీట్ల వ్య‌వ‌హారంలోనూ డీఎంకే, కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య వివాదం రాజుకుంది. త‌మ‌కు ఒక సీటు ఇవ్వాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. త‌మ‌కు 35 సీట్లు కావాల‌ని కాంగ్రెస్ కోరింది.

కానీ, కాంగ్రెస్ పెర‌ఫార్మెన్స్‌పై అనుమానం ఉన్న డీఎంకే చీఫ్‌,సీఎం స్టాలిన్ అసెంబ్లీ సీట్ల‌ను 20కి మించి ఇచ్చేది లేద‌ని.. రాజ్య‌స‌భ లో ఒక్క‌సీటు కూడా ఇవ్వ‌బోమ‌ని చెప్పారు. దీంతో డీఎంకే నుంచి కాంగ్రెస్ దూరం జ‌రిగే ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్ర‌మంలోనే విజ‌య్‌తో చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేసింది. దీనిని విజ‌య్ కూడా స్వాగ‌తించారు. ఈ క్ర‌మంలో టీవీకే+ కాంగ్రెస్ మ‌ధ్య‌ సీట్ల పంప‌కాల‌పై కూడా నేడో రేపో చ‌ర్చ‌లు ప్రారంభం కానున్నాయ‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో సుమారు 50-70 సీట్ల‌ను కాంగ్రెస్ ఆశించిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెప్పాయి.

మొత్తంగా విజ‌య్ కూడా కాంగ్రెస్‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో స్టాలిన్ అనూహ్యంగా చ‌క్రం తిప్పారు. విజ‌య్‌కు మ‌రో పార్టీ తోడైతే.. ఇబ్బంది వ‌స్తుంద‌ని భావించిన ఆయ‌న‌.. కాంగ్రెస్‌తో బుధ‌వారం రాత్రికి రాత్రి చ‌ర్చ‌ల‌కు దిగారు. కాంగ్రెస్ కోరుతున్న‌ట్టుగా 30 సీట్లు.. తాను అనుకున్న‌ట్టుగా 20 సీట్లు కాకుండా.. మ‌ధ్యే మార్గంగా 28 సీట్ల‌ను ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఇక‌, రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో డీఎంకే=కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు కొన‌సాగుతుంద‌ని ఇరు పార్టీలు ప్ర‌క‌టించాయి. దీంతో విజ‌య్ పార్టీ టీవీకే ఇక‌, కాంగ్రెస్‌పై ఆశ‌లు వ‌దులుకుంది. ప్ర‌స్తుతం ఇత‌ర పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశంపైనా టీవీకే ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

వాస్త‌వానికి ఇత‌ర పార్టీలు ఏమైనా ఉంటే.. అది శ‌శిక‌ళ పెట్ట‌బోయే పార్టీనే. మిగిలిన‌వన్నీ.. ఇటు డీఎంకే, అటు బీజేపీతో పొత్తులో ఉన్నాయి. దీంతో ఈ సారికి విజ‌య్ ఒంట‌రి పోరు చేయాల్సి రావ‌డం త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాగా.. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో తొలిసారి బ‌రిలోకి దిగుతున్న విజ‌య్‌కు ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుంద‌నేది చూడాలి.

గ‌తంలో త‌మిళ హీరోలు క‌మ‌ల్ హాస‌న్ స‌హా.. విజ‌య్‌కాంత్(డీఎండీకే) పెట్టిన పార్టీలు విఫ‌ల‌మ‌య్యాయి. క‌నీసం వారు కూడా గెల‌వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ పార్టీ మ‌క్క‌ల్ నీది మ‌య్యం.. డీఎంకే భాగ‌స్వామిగా ఉంది. కొన్నాళ్ల కింద‌టే క‌మ‌ల్‌.. రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.