గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు రూపానీ సంచలన ప్రకటన చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఆచార్య దేవ వ్రత్ను కలిసిన రూపానీ…తన రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ నేతలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పార్టీ సంప్రదాయమని, తనకు పార్టీ అప్పగించే కొత్త బాధ్యతలను నిర్వహిస్తానని అన్నారు. మోడీ, కేంద్ర నాయకత్వం నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయిస్తారని అన్నారు.
అయితే, ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ సొంత ఇలాకా అయిన గుజరాత్లో ఆయనతో కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో పాల్గొన్న రూపానీ…హఠాత్తుగా రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, విజయ్ రూపానీతో పాటు కేబినెట్ మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేయడం విశేషం. ఇంత సడెన్ గా రాజీనామా చేయడానికి గల కారణాలేమిటని విలేకరులు ప్రశ్నించగా…రూపానీ సమాధానం దాటవేశారు.
2016లో నాటి సీఎం ఆనందీ బెన్ పటేల్ రాజీనామా అనంతరం సీఎం పగ్గాలు చేపట్టిన రూపానీ…పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం వేడిని తట్టుకొని మరీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే,అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న సమయంలో రూపానీ రాజీనామా చేయడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రూపానీ స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నితిన్ పటేల్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాదిలో పదవి కోల్పోయిన నాలుగో సీఎం రూపానీ. జులైలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్లో త్రివేంద్ర రావత్, తీరథ్ సింగ్ రావత్ ఇద్దరు కొంత గ్యాప్ తోనే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గుజరాత్ లో కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, విజయ్ రూపానీ అనారోగ్య సమస్యలతోనే రాజీనామా చేశారని గుజరాత్ బీజేపీ నాయకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates