హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే విషయం పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కువగా.. కొండా సురేఖ పేరు వినపడుతోంది. ఆమె అయితే.. కరెక్ట్ అంటూ చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మొగ్గు చేపుతూ వస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సైతం కొండా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కొండా పాత నియోజకవర్గం పరకాలకు హుజురాబాద్ ఆనుకొని ఉండటం, మంత్రిగా కొండాకు ఈ ప్రాంతంపై అవగాహన ఉండటంతో గట్టి అభ్యర్థిగా కొండా సురేఖ అయితేనే బెస్ట్ అంటూ పార్టీ వర్గాలు మొగ్గుచూపుతున్నాయి.
తాజాగా… హుజురాబాద్ పోటీపై కొండా సురేఖ తొలిసారి నోరు విప్పారు. అధిష్టానం, పీసీసీ చీఫ్ కోరితే తాను హుజురాబాద్ బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గట్టి అభ్యర్థిగా పార్టీ తనను పోటీ చేయాలని కోరితే కాదు అనని… అయితే, అధికారికంగా పార్టీ పెద్దల నుండి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
అయితే, తాను హుజురాబాద్ నుండి పోటీ చేసినా వరంగల్ ను విడిచిపెట్టనని… తాను వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పాత నియోజకవర్గానికే వస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.