2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్‌లో సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్‌పై పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ తరచూ ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి రెబల్‌గా మారిన ఈ ఎంపీ ఇప్పటికే సీఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఇప్పుడిక ఆయన కన్ను ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై పడింది. సజ్జలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ రఘురామ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వైసీపీ పార్టీని జగన్‌కు ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్న రఘురామ ఇప్పుడు సజ్జలను టార్గెట్ చేశారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అక్రమాస్తుల కేసుల జగన్.. విజయ సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించగా దానిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ నెల 25న తీర్పు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఓ వైపు జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ ప్రచారం కోనసాగుతోంది. ఇక ఇప్పుడేమో సజ్జలను రఘురామ లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ఆయన ప్రభుత్వం నుంచి నెలకు రూ.2.50 లక్షల జీతం తీసుకుంటున్నారని దీనికి అదనంగా మరిన్ని బాధ్యతల పేరుతో మరో రూ.2.5 లక్షలు పొందుతున్నారని తన పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంబంధాల సలహాదారుడిగా నియమించిన సజ్జల ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు కాబట్టి ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్తాయని పిల్‌లో ప్రస్తావించారు.
ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల వైసీపీ పార్టీకి చెందిన నాయకుడని ఆయన ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ మూడు జిల్లాలకు ఇంఛార్జ్ గానూ పని చేస్తున్నారని రఘురమా పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు బాధ్యతల్లో ఉంటూ పార్టీ కార్యాలయం నుంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ పాత్ర పోషిస్తున్నారంటూ రఘురామ ఆరోపించారు. సలహాదారుడిగా ఉన్న ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్‌లో పొందుపరిచారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సజ్జలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని రఘురామ కోర్టును కోరారు. సలహాదారులకు ప్రత్యేక నియామవళి లేదని పేర్కొన్న ఆయన.. వారికి సివిల్ సర్వీసెస్ నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు.
ఇప్పటికే పార్టీ అధినేత సీఎం జగన్.. ఆ తర్వాత పార్టీలో అంతటి ప్రాధాన్యత ఉన్న విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వాళ్లను లాక్ చేసిన రఘురామ ఇప్పుడు వాళ్లిద్దరి తర్వాత పార్టీలో ప్రాధాన్యత ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు ఆయన లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చట్టం ప్రకారమే సజ్జలను ఇరికించే ప్రయత్నాలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పిల్‌పై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ రేగుతోంది.