అంబానీ, అదానీయే టార్గెట్టా ?

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రైతుగండం తప్పేట్లు లేదు. గడచిన తొమ్మిది నెలలుగా కంటిన్యూ అవుతున్న రైతుల ఆందోళనలో భాగంగా ఢిల్లీ శివార్లలోని ముజఫర్ నగర్లో ఆదివారం ‘కిసాన్ మహాపంచాయత్’ సభ జరిగింది. ఈ పంచాయత్ కు యూపీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుండి పెద్దఎత్తున రైతులు, రైతుసంఘాలు పాల్గొన్నాయి. పాల్గొన్న రైతులు, రైతు సంఘాల్లో కూడా యూపీ, పంజాబ్ నుండి పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబానీ, అదానీ యే టార్గెట్ గా మారటం ఆశ్చర్యంగా ఉంది.

తాజాగా జరిగిన కిసాన్ పంచాయత్ సమావేశంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పై రైతాంగంలో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందో అర్థమైపోతోంది. యూపీలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావాలంటే రైతాంగం మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే యూపీలో రైతుల ఓట్లే అత్యధికం. ప్రస్తుతం కిసాన్ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న రాకేష్ తికాయత్ ది యూపీనే. ఈయన జాట్ల సామాజికవర్గానికి చెందిన నేత. పోయిన ఎన్నికల్లో జాట్లు ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలోని జాట్లలో అత్యధికులు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాకేష్ తికాయత్ జాట్ల సామాజిక వర్గం లో తిరుగులేని నేత. తికాయత్ పిలుపు మేరకు యూపీలో ఎక్కడెక్కడయితే జాట్లున్నారో అక్కడల్లా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు గట్టిగా జరుగుతున్నాయి. తికాయత్ నాయకత్వంలో జాట్లు మాత్రమే కాకుండా ఇతర సామాజికవర్గాలకు చెందిన రైతాంగం కూడా పెద్దఎత్తున ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

గడచిన తొమ్మిది నెలలుగా ఢిల్లీ శివార్లలోని ముజఫర్ నగర్, సింగూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమంలో యూపీ, పంజాబ్ కు చెందిన రైతులే చాలా ఎక్కువ మందున్నారు. తాజాగా జరిగిన కిసాన్ మహా పంచాయత్ లో తికాయత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటు పిలుపిచ్చారు. నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మేస్తుంటే అంబానీ, అదానీలు కొనేస్తున్నారంటు తికాయత్ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే పంజాబ్ లో రిలయన్స్ కు చెందిన సెల్ టవర్లు, వ్యాపార సముదాయాలపై ఒకసారి దాడులు జరిగిన విషయం తెలిసిందే.

దేశంలో మోడీ అమ్మేస్తున్న వివిధ ఆస్తులను అంబానీ, అదానీలే కొనేస్తున్నారంటూ తికాయత్ చేసిన ఆరోపణలకు రైతాంగం బాగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోను మోడి అమ్మకాలు, అంబానీ, అదానీల కొనుగోళ్లను అడ్డుకుని తీరాలంటు చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న తికాయత్ పిలుపుకు రైతాంగం నూరుశాతం సంఘీభావం పాటించారు. దాంతోనే బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది.