బద్వేలు టీడీపీ అభ్యర్ధి ఎవరో తెలుసా ?

కడప జిల్లా బద్వేలులో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించటానికే చంద్రబాబు మొగ్గుచూపారు. రాజశేఖర్ మొన్నటి 2019 ఎన్నికల్లో కూడా పోటీచేసి ఓడిపోయారు. ఎస్సీ నియోజకవర్గమైన బద్వేలులో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేయగా టీడీపీ తరపున రాజశేఖర్ పోటీచేశారు. ఇద్దరు డాక్టర్ల పోటీలో వెంకటసుబ్బయ్య భారీ మెజారిటితో గెలిచారు.

వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా టీడీపీ తరపున పోటీచేసిన రాజశేఖర్ కు 50,748 ఓట్లువచ్చాయి. అంటే 44,734 ఓట్ల భారీ మెజారిటితో వైసీపీ గెలిచింది. వెంకటసుబ్బయ్య దాదాపు ఆరుమాసాల క్రిందట అనారోగ్యంతో మరణించారు. దాంతో ఉపఎన్నికలు అవసరమయ్యాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఉపఎన్నికలు వాయిదాపడుతోంది. పరిస్ధితులు అనుకూలిస్తే బహుశా వచ్చే నవంబర్లో ఉపఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నారు.

ఇక కడప జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు బద్వేలు ఉపఎన్నికలో పోటీచేయబోయే అభ్యర్ధిపై చర్చించారు. పోయిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన రాజశేఖర్ నే మళ్ళీ పోటీ చేయించాలని సమావేశంలో డిసైడ్ అయ్యింది. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనకు ముందు బద్వేలులో మరో సీనియర్ నేత విజయలక్ష్మితో పార్టీ అధినేత చర్చించారు. ఎందుకంటే ఈమె కూడా పోటీచేసే విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరి ఫోన్ సంభాషణలో విజయలక్ష్మి ఏమి చెప్పారనే విషయంలో క్లారిటి లేదు.

చూస్తుంటే బద్వేలు ఉపఎన్నికలో అభ్యర్ధి ఎంపికపై చంద్రబాబు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఫార్ములానే ఫాలో అయినట్లు అర్ధమవుతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా నోటిఫికేషన్ రాకమునుపే చంద్రబాబు పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత పనబాక విషయంలో ఎన్ని ట్విస్టులు జరిగాయో అందరికీ తెలిసిందే. అసలామె ఉపఎన్నికలో పోటీచేస్తారా ? లేదా అనే విషయం కూడా చాలా కాలంపాటు సస్పెన్సుగానే ఉండిపోయింది. ఇపుడు కూడా బద్వేలు ఉపఎన్నిక అభ్యర్ధిని చంద్రబాబు ఇలాగే ప్రకటించేశారు.

వైసీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిని జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రకటించలేదు. చివరి నిముషంలో ప్రకటించినా ఆశ్చర్యంలేదు. మరణించిన డాక్టర్ వెంకటసుబ్బయ్య కుంటుబం నుండే అభ్యర్ది ఉంటారా ? లేకపోతే బయట వ్యక్తిని ఎంపిక చేస్తారా తెలీటంలేదు. ఎందుకంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా చనిపోయిన బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబం నుండే ఒకరిని పోటీ చేయిస్తారని అందరు అనుకున్నారు. కానీ జగన్ మాత్రం బయటవ్యక్తి డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. కాబట్టి బద్వేలు విషయంలో ఏమి చేస్తారో చూడాలి.