హుజూరాబాద్ లో డబ్బే డబ్బు

అవును మీరు చదివింది అక్షరాల నిజమేనట. కాకపోతే నియోజకవర్గానికి అందుతున్న నిధులన్నీ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల రూపంలో వస్తున్నాయి. కానీ జనాలు చెప్పుకుంటున్న డబ్బంతా పార్టీలు వెదలజల్లుతున్నది. పార్టీలు వెదజల్లుతున్న డబ్బంటే అనధికారికంగా స్ధానికనేతలకు అందిస్తున్న డబ్బన్నమాట. ఎప్పుడు జరుగుతుందో స్పష్టతలేని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒకవైపు కేసీయార్, మరోవైపు ఈటల రాజేందర్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే ఎవరికివారుగా స్దానికంగా వివిధ మండలాల్లో ఉన్న నేతలను మచ్చిక చేసుకోవటం కోసం ముందు వెనకా ఆలోచించకుండా డబ్బులు వెదలజల్లుతున్నట్లు టాక్. కేసీయార్ తరపున టీఆర్ఎస్ డబ్బు సంచులను కుమ్మరిస్తుంటే బీజేపీ అభ్యర్ధి హోదాలో ఈటల డబ్బుల మూటలను విప్పుతున్నారట. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ వరకు గట్టి నేతలు ఎవరు ? అనే విషయాలపై రెండు పార్టీల నేతలు బూతద్దం వేసి వెతికారట.

ఓ 200 ఓట్లు వేయించే సామర్ధ్యం ఉంది అని తెలుసుకున్న స్ధానిక నేతలందరి దగ్గరకు టీఆర్ఎస్, బీజేపీ నేతలు వాలిపోతున్నట్లు సమాచారం. బేరాలు లేకుండా వాళ్ళడిగినంత డబ్బును ముట్టజెబుతున్నారట. పార్టీల నేతల సంగతిని పక్కనపెట్టేస్తే వివిధ కులసంఘాల నేతలు, కులసంఘాల్లో కీలక వ్యక్తుల చుట్టూ కూడా పై రెండు పార్టీల నేతలు ప్రదక్షిణాలు చేస్తున్నారట. వాళ్ళెక్కడ చేయి జారిపోతారో అనే భయంతోనే అడిగినంత డబ్బు ముందే ఇచ్చేసి కమిట్ చేయించుకుంటున్నారట.

సరే ఇపుడు రాజకీయాలంతా డబ్బుల చుట్టే తిరుగుతోంది కదా ? అందుకనే స్ధానికంగా ఉంటున్న ఓ మాదిరి నేతలు కూడా పార్టీల నుండి వీలైనంత డబ్బును తీసుకుంటున్నారట. ఈ పద్దతిలో రాత్రికి రాత్రే లక్షలు వసూళ్ళు చేసిన నేతలున్నారట హుజూరాబాద్ లో. మరి వీళ్ళు చెబితే వినే ఓటర్లు ఎంతమంది ? అసలు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ? ఇపుడు పంచే డబ్బుల ప్రభావం పోలింగ్ నాటివరకు ఉంటుందా ? అనేది చాలామందిని పట్టిపీడిస్తున్న అనుమానాలు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవటమన్నది టీఆర్ఎస్, ఈటల మధ్య చావో రేవో అయిపోయింది. ఈటల ఓడిపోతే బీజేపీకి వచ్చే నష్టమేమీలేదనే చెప్పాలి. గెలిస్తే బీజేపీ గెలిచినట్లు కమలనాదులు ప్రచారం చేసుకుంటారు. అదే టీఆర్ఎస్ ఓడిపోతే కేసీయార్ కు వ్యక్తిగతంగా చాలా దెబ్బవుతుంది. ఎందకంటే ఒక మామూలు ఉపఎన్నికను కేసీయార్ తనంతట తానుగా ప్రిస్టేజిగా మార్చేశారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా, ఓడినా తమకు వచ్చే లాభము, నష్టం ఏమీ లేదని ఇఫుడు మంత్రులు హరీష్ రావు, కేటీయార్ చెబుతున్నారు.

మంత్రులు చెప్పింది నిజమే అయితే మరి ఈటలను ఓడించటమే ధ్యేయంగా అంతమంది మంత్రులకు నియోజకవర్గాల బాధ్యతలను ఎందుకు అప్పగించినట్లు ? ప్రతి మండలానికి అన్నేసి మంది నేతలను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? దళితబంధు పథకం అమలు, నియోజకవర్గంలో పెద్దఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలను ఎందుకు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయటమే కాకుండా పనులు మొదలుపెట్టేశారు ? ప్రభుత్వం తరపున జరుగుతున్నది చూసిన తర్వాత ఉపఎన్నికలో గెలుపును కేసీయార్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమైపోతోంది. అందుకనే స్ధానికి నేతలకు డబ్బులే డబ్బులు.