‘వైయస్ ఆత్మీయ సమ్మేళనం’లో వైఎస్ ఆత్మ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా వైఎస్ కుటుంబంతోపాటు ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిలతో కలిసి వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైయస్ విజయమ్మ…ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ‘వైయస్ ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కు సన్నిహితంగా ఉన్న పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు అధికారులను విజయమ్మ ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి వైఎస్ ఆత్మగా పేరున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు హాజరవుతారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేవీపీ…వైసీపీ నేతగా ఉన్న విజయమ్మ నిర్వహించే కార్యక్రమానికి వెళతారా లేదా అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాను ఆ కార్యక్రమానికి హాజరుకాబోతున్నానని కేవీపీ క్లారిటీ ఇచ్చారు. వైయస్సార్ అందరికి కావాల్సిన వ్యక్తి అని, ఆత్మీయ సమ్మేళనానికి తాను కూడా వెళ్తున్నానని కేవీపీ చెప్పారు. తనకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించారని వెల్లడించారు. వైయస్ ఆత్మీయ సమ్మేళనా’నికి కేవీపీ హాజరు కావడం వెనుక మతలబేంటి? వైఎస్సార్ టీపీకి ఆయన మద్దతివ్వబోతున్నారా? అన్న చర్చ మొదలైంది.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరగబోతోన్న ఈ కార్యక్రమానికి అప్పట్లో వైఎస్ తో కలిసి పనిచేసిన నాయకులు, అధికారులు, జర్నలిస్టులు హాజరు కాబోతున్నారు. మంత్రి బొత్స సత్యన్నారాయణతో పాటు మరి కొందరు వైసీపీ నేతలను, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్ తో పాటు మరి కొందరు కాంగ్రెస్ నేతలను విజయమ్మ ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలకూ ఆహ్వానం అందింది. అయితే, ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

అయితే, వైఎస్సార్ టీపీకి అండగా నిలిచేందుకే ఈ సభను విజయమ్మ నిర్వహిస్తున్నారని, ఈ సభ వెనుక కర్త, కర్మ, క్రియ పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ అని టాక్ వస్తోంది. కానీ, అప్పటి వైఎస్ విధేయులంతా ఇప్పుడు పలు రాజకీయ పార్టీల్లో పాతుకుపోయారు. ఇటు ఏపీలో వైసీపీకైనా, అటు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లకైనా వైఎస్సార్ టీపీ వైరి పార్టీనే అవుతుంది. అటువంటి సందర్భంలో షర్మిలకు మద్దతిస్తున్న విజయమ్మ నిర్వహించే ఈ సమ్మేళనానికి ఎవరెవరు హాజరవుతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ, ఇది కేవలం వైఎస్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే కార్యక్రమం మాత్రమే అని, దానికి రాజకీయ ప్రత్యేకత లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.