త‌గ్గేదేలే.. అంటోన్న రేవంత్‌

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చార‌నే ప్ర‌చారాన్ని చేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ గ‌త కొంత‌కాలంగా ఆ విష‌యాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో విఫ‌ల‌మైంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లూ త‌మ స్వ‌రాన్ని గ‌ట్టిగా వినిపించ‌లేక‌పోయారు. త‌మ పార్టీ వ‌ల్లే తెలంగాణ క‌ల సాకార‌మైంద‌ని చెప్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను మాత్రం పొంద‌లేక‌పోయారు.
దీంతో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి ఘోర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇక ప్ర‌తిప‌క్ష పార్టీగానూ ప్ర‌భుత్వంపై దాడి చేయ‌లేక‌పోయింది. అధికార నేత‌ల మాట‌ల‌కు కాంగ్రెస్ నాయ‌కులు స‌రైన రీతిలో స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయారు. కానీ ఇప్పుడా పార్టీలో ప‌రిస్థితి మారింది. టీఆర్ఎస్ నేత‌లు ఒక్క మాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ప‌ది మాట‌లు వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం టీపీసీసీ కొత్త అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన‌డంలో సందేహం లేదు.

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత రేవంత్ రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఆయ‌న మాట‌ల్లో ఎప్పుడూ వాడివేడి ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడు మ‌రింత వేగం పెంచారు. అధికార ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డిపై ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. మ‌ల్లారెడ్డి త‌న విద్యాసంస్థ‌ల కోసం భూక‌బ్జా చేశార‌ని ఆయ‌న అవినీతి ప‌రుడ‌ని గ్రేడింగ్ కోసం న్యాక్‌కు ఫోర్జ‌రీ ప‌త్రాలు స‌మ‌ర్పించి నిజం కాదా? అని ఆరోపించారు. వీటిపై స్పందించిన మ‌ల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

రేవంత్‌కు ద‌మ్ముంటే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని తాను కూడా రాజీనామా చేస్తాన‌ని ఇద్ద‌రం క‌లిసి ఎన్నిక‌ల్లో నిల్చుందామ‌ని మ‌ల్లారెడ్డి తొడగొట్టి మ‌రీ స‌వాలు చేశారు. నోటికి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మ‌ల్లారెడ్డి మాట్లాడారు. అయితే మ‌ల్లారెడ్డి స‌వాలుకు రేవంత్ దీటుగానే స్పందించారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే భ‌య‌ప‌డ‌తాన‌ని అనుకున్నారా అసలు త‌గ్గేదేలే అన్న‌ట్లు రేవంత్ కౌంట‌ర్ ఇచ్చారు. మ‌ల్లారెడ్డి స‌గం బ్రోక‌ర్‌, స‌గం జోక‌ర్ అంటూ రేవంత్ ఘాటు స‌మాధానమిచ్చారు. మ‌ల్లారెడ్డి భూ అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా నిరూపిస్తామని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో మాజీ ఉప ముఖ్య‌మంత్రి రాజ‌య్య‌, ఈట‌ల రాజేంద‌ర్‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌లు తీసుకున్నార‌ని మ‌రి మ‌ల్లారెడ్డి విష‌యంలో మాత్రం కేసీఆర్ ఎందుకు స్పందించ‌ట్లేద‌ని ప్ర‌శ్నించిన రేవంత్ కేసీఆర్‌ను ఇర‌కాటంలో పెట్టారు.

2019లో మ‌ల్లారెడ్డి అల్లుడి మీద గెలిచాన‌ని చెప్పిన రేవంత్‌.. ఇక మ‌ల్లారెడ్డిని ప‌ట్టించుకునే ప్ర‌స‌క్తే లేద‌ని పేర్కొన్నారు. ఫైన‌ల్లో పోటీ కేసీఆర్‌పైనేన‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ రాజీనామా చేస్తే గ‌జ్వేల్ ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై పోటీకి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించి త‌న జోరును ప్ర‌ద‌ర్శించారు. అధికార ప్ర‌భుత్వంపై పోరాటంలో దూసుకెళ్తోన్న రేవంత్ ఇచ్చిన స్ఫూర్తితో ఇత‌ర కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు క్రియాశీల‌కంగా మారారు. రేవంత్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి దూకుడుతో కాంగ్రెస్ పార్టీలో ఓ కొత్త జోష్ వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)