విద్యార్ధులు.. తలా రు. 50 లక్షలు చెల్లించండి

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి ఇష్టపడని విద్యార్థుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తమిళనాడులో ఎంబీబీఎస్ చదివిన విద్యార్ధులు పీజీ అయిన తర్వాత కచ్చితంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తామంటు అండర్ టేకింగ్ ఇవ్వాలి. నిజానికి ఇలాంటి అండర్ టేకింగ్ లే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇవ్వాల్సుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తామని హామీ పత్రంపై సంతకం చేయాలి.

మరికొన్ని రాష్ట్రాల్లో ఏమో రెండేళ్ళపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పనిచేస్తామని అండర్ టేకింగ్ ఇవ్వాలి. ఏ ప్రభుత్వం ఏ పద్దతిని పాటిస్తున్నా దానికి కారణం ఏమిటంటే పేదలకు నిరంతరంగా వైద్య సేవలు అందించటమే లక్ష్యం. అయితే తాజాగా తమిళనాడులో పీజీ అయిపోయిన వైద్య విద్యార్ధుల్లో 112 మంది తాము ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసేది లేదంటు అడ్డం తిరిగారు. అంటే తామిచ్చిన అండర్ టేకింగ్ కు వ్యతిరేకంగా గొడవ మొదలుపెట్టారు.

దీంతో చిర్రెత్తిన ప్రభుత్వం ఆ 112 విద్యార్థులు తలా రు. 50 లక్షలు ప్రభుత్వానికి వెంటనే చెల్లించాలని నోటీసులిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న ప్రతి ఎంబీబీఎస్ విద్యార్థి పైనా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. ప్రైవేటు కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి తీసుకున్న బ్రాంచ్ డిమాండ్ ప్రకారం తక్కువలో తక్కువ కోటి రూపాయలు చెల్లించాల్సిందే.

అదే ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులు చాలా నామమాత్రంగానే ఉంటున్నాయి. సామాజిక బాధ్యతగా విద్యార్ధుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టే ప్రభుత్వ కాలేజీల్లో చదివిన  పీజీ విద్యర్ధులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని నిబంధన పెట్టింది తమిళనాడు ప్రభుత్వం. పీజీ చదివే ముందు అండర్ టేకింగ్ ఇచ్చి తర్వాత ఉల్లంఘించటంతోనే విద్యార్థుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరి విద్యార్ధులు తలా రు. 50 లక్షలు చెల్లిస్తారా ? ప్రభుత్వాసుపత్రికి డ్యూటీ చేస్తారా  ? లేదా కోర్టుకెళతారా ? చూడాల్సిందే.