రేవంత్‌కు సీఎం కుర్చీ లేకుండా ఇదో మాస్ట‌ర్ స్కెచ్ ?

ఎవరికైనా ఆశ ఉంటుంది. రాజకీయ నాయకులకు అయితే అది మహా లావుగా ఉంటుంది. ఇక పీసీసీ కిరీటం తగిలించుకుని తెలంగాణా అంతా కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తున్న రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలనే ఆశ ఉంటుంది. అందులో తప్పు లేదు కూడా. లేకపోతే తెల్లారి లేస్తే కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తూ ఒకటికి నాలుగు తిట్లు తింటూ రేవంత్ ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మరో వైపు రేవత్ హాట్ హాట్ కామెంట్స్ వల్లనో, లేక కేసీఆర్ అంటే ఆయన బద్ధ వైరం చూపిస్తారు అన్న నమ్మకం వల్లనో కొంత జనాలు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరో వైపు సీనియర్లు తిన్నగా వ్యవహరిస్తే కాంగ్రెస్ బండి విజయ తీరం వైపుగా కూడా సాగవచ్చు. అపుడు తెలంగాణా వచ్చాక కాంగ్రెస్ తరఫున తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కావాలి. న్యాయం ప్రకారం చూసినా ఇదే అని అంతా చెబుతారు. కానీ మొదటి నుంచి పీసీసీ చీఫ్ పదవి మీద గంపెడాశలు పెట్టుకుని ఢిల్లీ దాకా వెళ్ళి పైరవీలు చేసి చివరికి రేవంత్ కి ఆ పదవి దక్కడంతో చిందులేసిన నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అయితే ఇప్పటికీ రేవంత్ కి అడ్డం పడుతూనే ఉన్నారు. ఆయన తాజాగా ఇచ్చిన ఒక ప్రకటన చూస్తే రేవంత్ కి సరైన షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అన్నట్లుగానే ఉందనుకోవాలి.

కాంగ్రెస్ రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దళితుడికే సీఎం పదవి అంటూ కోమటి రెడ్డి చేసిన ప్రకటన కచ్చితంగా రేవంత్ ని ఉద్దేశించే అని చెప్పాలి. నిజానికి తెలంగాణా తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్న కేసీఆర్ ప్లేట్ ఫిరాయించి సీఎం గా గత ఏడేళ్ళుగా అధికారాన్ని అనుభవిస్తున్నారు. మరి కాంగ్రెస్ ఒక పార్టీగా అలాంటి ప్రకటన ఏదీ ఇప్పటిదాకా చేయలేదు. దళితులకు న్యాయం చేస్తామని మాత్రమే అంటోంది. మరో వైపు కేసీయార్ దళిత బంధుని కౌంటర్ చేస్తూ రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నారు. ఆయన కూడా దళిత సీఎం అనడంలేదు. తెలంగాణాలోని కాంగ్రెస్ భవనానికి అంబేద్కర్ పేరు పెడతామని చెబుతున్నారు.

కానీ టైమ్ చూసి మరీ షాక్ ఇచ్చినట్లుగా కోమటిరెడ్డి దళిత సీఎం కాంగ్రెస్ నుంచే వస్తారు అంటూ ఇచ్చిన ప్రకటన మాత్రం రేవంత్ అవకాశాలను దెబ్బ కొట్టేందుకే అంటున్నారు. మరి ఆయన మాట అధినాయకత్వానికి నచ్చుతుందో లేదో చూడాలి. మరో వైపు కేసీఆర్ దళిత బంధు అంటూ ముందుకు వస్తే కాంగ్రెస్ హై కమాండ్ కూడా కోమటిరెడ్డిలా మా సీఎం దళితుడు అంటూ ట్విస్ట్ ఇస్తే రేవంత్ ఆశలు పూర్తిగా అవిరి అయినట్లే. మొత్తానికి చూసుకుంటే మాత్రం రేవంత్ శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఆయనకు మాత్రం సీఎం సీటు దక్కకూడదు అన్నట్లుగా సీనియర్ల వ్యవహారం ఉంది అంటున్నారు.