జగన్ ప్రభుత్వంలో నెంబర్ వన్ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డే.. సర్వం తానే అయి.. ప్రబుత్వాన్ని నడిపించ నున్నారా? వచ్చే ఐదార్రోజుల పాటు.. ఆయనే అప్రకటిత ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారా? అంటే.. వైసీపీ నేతలు అటు ఔనని, ఇటు కాదని నిర్దిష్టంగా చెప్పలేక పోతున్నారు. అయితే.. ఇదే విషయంపై మాత్రం వారు కూడా గుసగుసలాడు తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబంతో సహా విహార యాత్రకువెళ్లారు. 25వ పెళ్లిరోజును పురస్కరించుకుని..సీఎం హోదాలోనే ఆయన సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 31న ఆయన తిరిగివస్తారు. మరి ఈ వారం రోజుల పాటు.. పాలనను ఎవరు చూస్తారు? అధికారులను, పాలనను ఎవరు నడిపిస్తారు? అనే చర్చ జోరుగా తెరమీదికి వచ్చింది.
దీనికి ఎవరూ సమాధానం చెప్పకపోయినా.. నిర్దిష్టంగా ఈయన బాధ్యత వహిస్తారని అనకపోయినా.. పరోక్ష్ంగా మాత్రం సజ్జల పేరును ఉటంకిస్తున్నారు. సో.. దీనిని బట్టి.. ఆయనే అప్రకటిత ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతారని అంటున్నారు. వాస్తవానికి.. గతంలోనూ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు తన కుటుంబంతో విహార యాత్రకు వెళ్లారు. అయితే.. ఆయన తన బాధ్యతలను తానే చూసుకునేవారు. ఎక్కడికి వెళ్లినా.. అన్నీతానే అయి.. అక్కడి నుంచే పాలనను సాగించేవారు. ఆన్‌లైన్ మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగించుకునేవారు. ఫోన్ ద్వారా నిత్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందుబాటులో ఉండేవారు. దీంతో అప్పట్లో చంద్రబాబు విహారానికి వెళ్లినా.. పాలన ఎవరు చూస్తారు? అనే ప్రశ్న తెరమీదికి రాలేదు.
కానీ, జగన్ విషయం అలా కాదు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. వెంటనే అక్కడి విషయాలకు మాత్రమే పరిమితమవుతారు.. తప్ప.. మళ్లీ పాలనను భుజాలపై వేసుకోరు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో జెరూసలేం యాత్రకు వెళ్లినప్పుడు.. పార్టీ వ్యవహారాలను వైవీ సుబ్బారెడ్డికి, అప్పటి కీలక నేత రాజమోహన్‌రెడ్డికి అప్పగించి వెళ్లారు. ఇక, ఇప్పుడు.. అధికారంలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు కూడా ఆయన తన బాధ్యతలను వెంటేసుకుని వెళ్లే అవకాశం లేదని వైసీపీ నేతలే అంటున్నారు. అంటే.. విహారయాత్రకు వెళ్లేది.. ఓ నాలుగు రోజులు కష్టాలు మరిచిపోవడానికే కదా! అందుకే జగన్ పాలనను ఖచ్చితంగా ఎవరో ఒకరికి అప్పగించే ఉంటారని అంటున్నారు వైసీపీనాయకులు.
అయితే.. ఇప్పటికిప్పుడు ఆయనకు అత్యంత నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారంటే.. అది సజ్జల మాత్రమే. సో.. ఆయనకే బాధ్యతలు అప్పగించి ఉంటారని అంటున్నారు. అయితే.. దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. అంతా సైలెంట్‌గానే చర్చించుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో సజ్జల ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ప్రస్తుతానికి ఆయన ఎవరికీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం లేదు. కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే అన్నీ చూస్తున్నారు. కానీ, కీలక విషయాలు వచ్చినప్పుడు.. సజ్జలఅరంగేట్రమే ఉంటుందని అంటున్నారు వైసీపీ నేతలు. అది కూడా గుసగుసగానే! ఇదీ సంగతి!!